పాలకుల రాజధర్మం పాటించాలి

ABN , First Publish Date - 2021-11-23T08:02:13+05:30 IST

మేధావులు, విద్యావంతులైన యువత దేశభవితలో కీలకం కావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు..

పాలకుల రాజధర్మం పాటించాలి

పుట్టపర్తి, నవంబరు 22: మేధావులు, విద్యావంతులైన యువత దేశభవితలో కీలకం కావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. సత్యసాయి 96వ జయంత్యుత్సవాలను పురస్కరించుకొని సోమవారం పుట్టపర్తిలోని ప్రశాంతినిలయంలోని పూర్ణచంద్ర హాలులో జరిగిన సత్యసాయి డీమ్డ్‌ యూనివర్సిటీ 40వ స్నాతకోత్సవంలో ముఖ్యఅతిఽథిగా ఆయన పాల్గొన్నారు. విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. అనంతరం మొదట  ఆంగ్లంలో, ఆ తర్వాత తెలుగులో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘సత్యసాయి విద్యాసంస్థలు మానవతా విలువలకు పెద్దపీట వేస్తూ, గురుకులాలను తలపిస్తున్నాయి. పరిశోధన, సాంకేతికత, సామాజిక సేవ, ఆధ్యాత్మికత వంటి అంశాలతో విద్యాబోధనను అందిస్తూ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. బాబా ఆశయాలకు అనుగుణంగా ఉపాధ్యాయులు, కుటుంబం, తల్లిదండ్రులు పెద్దలను విద్యార్థులు గౌరవిస్తూ సమాజ హితానికి పాటుపడాలి’’ అని జస్టిస్‌ ఎన్వీ రమణ ఉద్బోధించారు. 


మాతృ భావనే బాబా సందేశం..

మాతృమూర్తి, మాతృభాష, మాతృదేశానికి  ప్రాధాన్యత ఇవ్వాలని బాబా సూచించారని జస్టిస్‌ ఎన్వీ రమణ గుర్తు చేశారు. ‘‘రామాయణం, మహాభారతాల్లో సమకాలీన సమాజానికి కావలసిన ఎన్నో అంశాలున్నాయి. ధర్మం, న్యాయం ఆధారంగా నెలకొన్న చట్టాలను ప్రజల రక్షణ కోసం, అందులోనూ ప్రధానంగా బలహీనులు, మహిళలు, వృద్ధులు, బాలల రక్షణ కోసం అమలు చేయడం రాజధర్మం అని పురాణాలు చెబుతున్నాయి. రాజ్యాలు, రాచరికాలు పోయాయన్న విషయాన్ని నేటి పాలకులు గుర్తించాలి. ప్రపంచ ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు’’ అని వ్యాఖ్యానించారు. అంతకుముందు చాన్స్‌లర్‌ చక్రవర్తి పీహెచ్‌డీ పట్టాలను అందచేసి సత్యసాయి విద్యావిధానం గురించి వివరించారు. అనంతరం సత్యసాయి ఆధ్యాత్మిక ప్రసంగాన్ని వినిపించారు. జనగణమనతో స్నాతకోత్సవాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రితురాజ్‌ అవస్థి, సీజేఐ సతీమణి నూతలపాటి శివమాల, సత్యసాయి ట్రస్టు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-23T08:02:13+05:30 IST