అందరూ నిద్రలో ఉండగా.. కూలనున్న చైనా రాకెట్.. పడేది సముద్రంలో కాదట!

ABN , First Publish Date - 2021-05-09T04:56:21+05:30 IST

కొన్ని రోజులుగా ప్రపంచంలో చర్చనీయాంశంగా మారిన అంశాల్లో చైనా లాంచ్ చేసిన లాంగ్ మార్చ్-బి రాకెట్ ఒకటి. ఈ రాకెట్ భూ ఆర్బిట్‌లోకి ప్రవేశించిన తర్వాత విఫలమై మళ్లీ భూమిపైకి దూసుకొస్తోంది.

అందరూ నిద్రలో ఉండగా.. కూలనున్న చైనా రాకెట్.. పడేది సముద్రంలో కాదట!

వాషింగ్టన్: కొన్ని రోజులుగా ప్రపంచంలో చర్చనీయాంశంగా మారిన అంశాల్లో చైనా లాంచ్ చేసిన లాంగ్ మార్చ్-బి రాకెట్ ఒకటి. ఈ రాకెట్ భూ ఆర్బిట్‌లోకి ప్రవేశించిన తర్వాత విఫలమై మళ్లీ భూమిపైకి దూసుకొస్తోంది. ఇది ఆదివారం అంటే ఈ నెల 9వ తేదీన భూమిపైకి చేరనున్నట్లు సమాచారం. అది కూడా తెల్లవారుజాము 4.30గంటలకు ఈ రాకెట్ భూమిని చేరుతుందని యూఎస్ మిలటరీ అంచనా వేసింది. ఇది కూలే ప్రాంతాన్ని కూడా వీళ్లు గుర్తించినట్లు సమాచారం. ఈ విషయంలో ప్రపంచ దేశాలన్నీ చైనాపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇది జనావాసాలపై కూలితే పరిస్థితేంటి? అంటూ ప్రశ్నలు కురిపించాయి. అయితే ఇలాంటి భయం అక్కర్లేదని భూ వాతావరణంలోకి మళ్లీ ప్రవేశించే సమయంలో రాకెట్ చాలా వరకు భస్మమైపోతుందని చెప్పిన చైనా.. ఏమైనా చిన్నా చితకా భాగాలు మిగిలినా కూడా ఏ సముద్రంలోనో పడిపోతాయని వాదించింది.


భూమిపై 70శాతం సముద్రాలే అన్న విషయాన్ని తన వాదనకు ఉపయోగించుకుంది. అయితే తాజాగా అమెరికా మిలటరీ అంచనాల ప్రకారం, ఈ రాకెట్ మధ్య ఆసియాలోని తుర్కమెనిస్తాన్‌ దేశంలో కూలుతుందట. ఇది ఎక్కడ కూలినా నష్టమైతే కచ్చితంగా జరుగుతుందని హార్వర్డ్ స్మిత్సోనియన్ సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్ శాస్త్రవేత్త జొనాథన్ మెక్‌డోవెల్ పేర్కొన్నారు. మరి ఈ రాకెట్ అమెరికా చెప్పినట్లు తుర్కమెనిస్తాన్‌లోనే కూలుతుందా? లేక వేరే దేశంలో కూలుతుందా? అని తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

Updated Date - 2021-05-09T04:56:21+05:30 IST