సంస్కృతుల గొప్పతనాన్ని చైనా నేతలు అర్థం చేసుకోలేరు : దలైలామా

ABN , First Publish Date - 2021-11-11T23:15:33+05:30 IST

విభిన్న సంస్కృతులకుగల గొప్పతనాన్ని చైనా

సంస్కృతుల గొప్పతనాన్ని చైనా నేతలు అర్థం చేసుకోలేరు : దలైలామా

టోక్యో : విభిన్న సంస్కృతులకుగల గొప్పతనాన్ని చైనా నేతలు అర్థం చేసుకోలేరని టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా అన్నారు. భారత దేశం మత సామరస్యానికి కేంద్రమని ప్రశంసించారు. టోక్యోలో బుధవారం నిర్వహించిన ఆన్‌లైన్ న్యూస్ కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు జపనీస్ మీడియా గురువారం తెలిపింది.


టిబెట్‌, జింజియాంగ్‌లలో విలసిల్లుతున్న విశిష్ట సంస్కృతి విలువను సంకుచిత మనస్కులైన చైనా కమ్యూనిస్టు నేతలు గుర్తించలేరని దలైలామా అన్నారు. చైనాలో అధిక సంఖ్యాకులైన హాన్ ప్రజలు మితిమీరిన నియంత్రణలకు పాల్పడుతుండటం వల్లే సమస్య ఉత్పన్నమవుతోందన్నారు. కమ్యూనిస్టు నేతల గురించి తనకు తెలుసునని, మావో జెడాంగ్ నుంచి అనేక మంది గురించి తనకు తెలుసునని చెప్పారు. వారి సిద్ధాంతాలు మంచివేనని, అయితే కొన్నిసార్లు వారు మితిమీరిన, కట్టుదిట్టమైన నియంత్రణలు విధిస్తారని చెప్పారు. 


చైనా ప్రాచీన సంస్కృతికి నిజమైన ఖజానా తైవాన్ అని పేర్కొన్నారు. దీనిపై ప్రస్తుతం అతి రాజకీయం చేస్తున్నారన్నారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో సమావేశమవాలనే ఆలోచన లేదని తెలిపారు. పాత మిత్రులను కలవడం కోసం మరోసారి చైనా వెళ్ళాలనే కోరిక ఉందని చెప్పారు. 


తాను భారత దేశంలోనే ప్రశాంతంగా ఉండటానికి ప్రాధాన్యమిస్తానని తెలిపారు. ఈ దేశం మత సామరస్యానికి కేంద్రమని ప్రశంసించారు. 


చైనా దళాలు దండయాత్ర చేయడంతో దలైలామా తన సహచరులతోపాటు టిబెట్ నుంచి 1959లో భారత దేశానికి వచ్చారు. ఆయన వేర్పాటువాది అని చైనా ఆరోపిస్తోంది. చైనా నుంచి టిబెట్‌ను వేరు చేయాలని ఆయన ప్రయత్నిస్తున్నారని మండిపడుతోంది.

 

Updated Date - 2021-11-11T23:15:33+05:30 IST