China, US warship: అమెరికా యుద్ధనౌకను తరిమికొట్టాం.. చైనా ప్రకటన!

ABN , First Publish Date - 2021-07-12T20:58:18+05:30 IST

దక్షిణ చైనా సముద్ర జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిన అమెరికా యుద్ధనౌకను తరిమికొట్టామని చైనా సోమవారం నాడు ప్రకటించింది.

China, US warship: అమెరికా యుద్ధనౌకను తరిమికొట్టాం.. చైనా ప్రకటన!

బీజింగ్: తమ అనుమతి లేకుండా దక్షిణ చైనా సముద్ర జలాల్లోకి ప్రవేశించిన అమెరికా యుద్ధనౌకను తరిమికొట్టామని చైనా సోమవారం నాడు ప్రకటించింది. ఆ జలాలపై చైనాకు ఎటువంటి హక్కు లేదని పర్మెనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ న్యాయస్థానం 2016 జులై 12న తీర్పు వెలువరించగా చైనా మిలిటరీ కూడా జులై 12నే ఈ ప్రకటన చేయడం గమనార్హం.


తమ అనుమతి తీసుకోకుండానే అమెరికా యుద్ధనౌక యూఎస్ఎస్ బెన్‌ఫోల్డ్ దక్షిణ చైనా సముద్రంలోని పరాసెల్ ద్వీపం సమీపంలోకి వచ్చిందని చైనా పేర్కొంది. ‘‘ఇది చైనా సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమే. దక్షిణ చైనా సముద్రంలో అస్థిర పరిస్థితులను సృష్టించడమే’’ అని చైనా మిలిటరీకి చెందిన దక్షిణ థియేటర్ కమాండ్ నేడు ఓ ఘాటు ప్రకటన విడుదల చేసింది. ఇటువంటి రెచ్చగొట్టే చర్యలను అమెరికా తక్షణం కట్టిపెట్టాలని కూడా డిమాండ్ చేసింది. అయితే.. ఈ విషయమై అమెరికా ఇప్పటివరకూ స్పందించలేదు. 


ఇక దక్షిణ చైనా సముద్రంలోని పరాసెల్ ద్వీపాలు కొన్నేళ్లుగా వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచాయి. పలు సహజవనరులకు నెలవైన ఈ ద్వీపంపై హక్కులు తమవేనంటూ చైనా పొరుగుదేశాలైన వియత్నాం, తైవాన్, ఫిలిప్పైన్స్, మలేషియా, బ్రూనై గతంలోనే పలు మార్లు ప్రకటించాయి. అయితే..దక్షిణ చైనా సముద్రంలోని ద్వీపాలతో సహా అక్కడి మెజారిటీ ప్రాంతం మొత్తం తనదేనని, ఇందుకు చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయని చైనా ఇప్పటికీ వాదిస్తోంది. ఈ వాదనను పర్మెనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ తోసిపుచ్చినా కూడా చైనా తన పట్టువీడటం లేదు.  

Updated Date - 2021-07-12T20:58:18+05:30 IST