అరుణాచల్ ప్రదేశ్‌లోని స్థలాల పేర్లు మార్చిన చైనా... ఘాటుగా స్పందించిన భారత్...

ABN , First Publish Date - 2021-12-31T18:20:03+05:30 IST

అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని స్థలాల పేర్లను చైనా మార్చడంపై

అరుణాచల్ ప్రదేశ్‌లోని స్థలాల పేర్లు మార్చిన చైనా... ఘాటుగా స్పందించిన భారత్...

న్యూఢిల్లీ : అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని స్థలాల పేర్లను చైనా మార్చడంపై భారత్ ఘాటుగా స్పందించింది. ఈ రాష్ట్రం ఎప్పటికీ భారత దేశంలో అంతర్భాగమేనని స్పష్టం చేసింది. చైనా కొత్తగా కనిపెట్టి, పెట్టే పేర్ల వల్ల ఈ యథార్థం మారబోదని తెలిపింది. 


అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు చైనా తన భాషలో పేర్లను మార్చినట్లు వస్తున్న వార్తల గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించినపుడు భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి స్పందించారు. ఈ కథనాలను గమనించినట్లు తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ గతంలో, ప్రస్తుతం, భవిష్యత్తులో ఎన్నటికీ భారత దేశంలో అంతర్భాగమేనని తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు, ప్రదేశాలకు కొత్తగా కనిపెట్టిన పేర్లను పెట్టడం వల్ల ఈ యథార్థం మారబోదని చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు, ప్రదేశాలకు చైనా పేర్లు పెడుతుండటం ఇదే మొదటిసారి కాదన్నారు. 2017 ఏప్రిల్‌లో కూడా ఇదే విధంగా ప్రయత్నించిందన్నారు. 


ఇదిలావుండగా, చైనా బుధవారం తన మ్యాప్‌లో 15 ప్రాంతాల పేర్లను మార్చింది. అరుణాచల్ ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్ అని పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్‌కు చైనీస్ పేరు జంగ్నన్. 90 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంగల భూమి తనదేనని పేర్కొంది. జంగ్నన్‌లోని ప్రదేశాలకు చైనీస్ అక్షరాలు, రోమన్, టిబెటన్ అక్షరాల్లో ఈ పేర్లను రాసింది.


చైనా నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ అక్టోబరు 23న ఆమోదించిన కొత్త సరిహద్దు చట్టం జనవరి నుంచి అమల్లోకి రాబోతోంది. చైనా భౌగోళిక సరిహద్దులను కాపాడుకోవడం కోసం ఈ చట్టాన్ని చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. 


Updated Date - 2021-12-31T18:20:03+05:30 IST