కీలక ఐరాస కమిటీకి భారత్ సారథ్యాన్ని అడ్డుకున్న చైనా

ABN , First Publish Date - 2021-01-13T00:02:42+05:30 IST

చైనాకు మన దేశంపైగల వ్యతిరేకత మరోసారి బయటపడింది.

కీలక ఐరాస కమిటీకి భారత్ సారథ్యాన్ని అడ్డుకున్న చైనా

న్యూఢిల్లీ : చైనాకు మన దేశంపైగల వ్యతిరేకత మరోసారి బయటపడింది. ఐక్యరాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలిలో చాలా ముఖ్యమైన ఆంక్షల కమిటీకి మన దేశం నాయకత్వం వహించేందుకు వచ్చిన అవకాశాన్ని దెబ్బతీసింది. భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశమైన చైనా ఈ విధంగా భారత దేశానికి వ్యతిరేకంగా పని చేయడం ఇదే తొలిసారి కాదు. 


ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో నాన్ పర్మనెంట్ మెంబర్‌గా ఈ ఏడాది నుంచి రెండేళ్ళపాటు భారత దేశం వ్యవహరిస్తుంది. ఈ మండలిలో వేర్వేరు అంశాలపై వేర్వేరు కమిటీలను ఏర్పాటు చేస్తారు. ఐరాసలో శాశ్వత భారత దేశ ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి గత గురువారం విడుదల చేసిన వీడియో సందేశంలో, ఐరాస భద్రతా మండలిలోని మూడు ముఖ్యమైన కమిటీలకు నాయకత్వం వహించాలని భారత దేశాన్ని కోరినట్లు తెలిపారు. తాలిబాన్ శాంక్షన్స్ కమిటీ, కౌంటర్ టెర్రరిజం కమిటీ, లిబియన్ శాంక్షన్స్ కమిటీలకు నాయకత్వం వహించాలని భారత దేశాన్ని కోరారని చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్ శాంతిభద్రతలు, అభివృద్ధి పట్ల మన దేశానికి చాలా శ్రద్ధ  ఉంది కాబట్టి తాలిబన్ శాంక్షన్స్ కమిటీకి నేతృత్వం వహించే అవకాశం రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కమిటీకి నాయకత్వం వహించే అవకాశం రావడం వల్ల ఆఫ్ఘనిస్థాన్‌లో శాంతి ప్రక్రియకు విఘాతం కలిగిస్తున్నవారిపైనా, ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్నవారిపైనా దృష్టి పెట్టేందుకు వీలవుతుందని తిరుమూర్తి అన్నారు. 


ఈ నేపథ్యంలో చైనా మన దేశానికి వచ్చిన అవకాశాన్ని అడ్డుకుంది. భద్రతా మండలి 1267 ఐఎస్ఐఎల్ అండ్ అల్ ఖైదా (తాలిబన్) శాంక్షన్స్ కమిటీకి నాయకత్వం వహించకుండా నిరోధించింది. భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్య దేశాల్లో ఒక దేశంగా తనకుగల అధికారాన్ని దీనికోసం వినియోగించింది. అంతర్జాతీయ ఉగ్రవాదులను గుర్తించి, ఆంక్షలు విధించేందుకు ఈ కమిటీ ద్వారా సాధ్యమవుతుంది. పాకిస్థానీ ఉగ్రవాదులను గుర్తించి, ఆంక్షలు విధించేందుకు వీలవుతుంది. మసూద్ అజహర్, హఫీజ్ సయీద్, జకీ ఉర్ రహమాన్ లఖ్వీ సహా అంతర్జాతీయ ఉగ్రవాదులపై ఆంక్షలు విధించేందుకు అవకాశం ఉంటుంది. ఈ కమిటీకి నేతృత్వం వహించే అవకాశం రాకపోయినప్పటికీ, ఆఫ్ఘనిస్థాన్ అభివృద్ధి, శాంతి ప్రక్రియ పట్ల భారత దేశం దృష్టి సారించింది.



Updated Date - 2021-01-13T00:02:42+05:30 IST