చైనా కొత్త పన్నాగం!

ABN , First Publish Date - 2021-10-28T08:32:51+05:30 IST

చైనా తాజాగా తీసుకొచ్చిన సరిహద్దు చట్టంపై భారత్‌ బుధవారం మండిపడింది. సరిహద్దుల విషయంలో డ్రాగన్‌ ఏకపక్ష ని..

చైనా కొత్త పన్నాగం!

ఎల్‌ఏసీ వెంబడి పట్టణాల నిర్మాణం

సైనిక విన్యాసాలు, ప్రజావాసాలకు వీలు

సరిహద్దు వివాదాల్ని పెంచేలా కొత్త చట్టం

ఆ చట్టం ఆందోళనకరం

ఇరు దేశాల మధ్య బంధంపై ప్రభావం: భారత్‌


న్యూఢిల్లీ, అక్టోబరు 27: చైనా తాజాగా తీసుకొచ్చిన సరిహద్దు చట్టంపై భారత్‌ బుధవారం మండిపడింది. సరిహద్దుల విషయంలో డ్రాగన్‌ ఏకపక్ష నిర్ణయాలకు పూనుకుంటోందని మండిపడింది. సరిహద్దుల విషయంలో చైనా ఇటీవల కొత్త చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తమ సరిహద్దుల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరించేలా చైనా ఆ చట్టాన్ని రూపొందించుకుంది. ‘‘ చైనా సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత చాలా పవిత్రమైనవి, అతిక్రమింపజాలనివి. వాటిని దెబ్బతీసే ఏ చర్యనైనా సరే ఎదుర్కొని, మా భూభాగాన్ని కాపాడుకుంటాం. సరిహద్దులను మరింత బలోపేతం చేయడంతో పాటు అక్కడ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి మద్దతునిస్తాం. ప్రజలు అక్కడ నివసించేలా, పనిచేసుకునేలా ప్రోత్సహిస్తాం. తమ విధుల్లో భాగంగా సరిహద్దుల్లో మా సైన్యం విన్యాసాలను నిర్వహిస్తుంది. అక్రమణలు, చొరబాట్లు, కవ్వింపులను నివారించేందుకు పోరాడుతుంది. సరిహద్దుల్లో పట్టణాలను నిర్మించి ప్రజా సేవలను, మౌలిక వసతులను పెంచుతాం’’ అని చట్టంలో పేర్కొంది. ఇప్పటికే భారత్‌తో వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి చైనా పలు చోట్ల తమ ప్రజల కోసం అంటూ పలు గ్రామాలను నిర్మించింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ చట్టం అమలులోకి రానుంది. 


భారత్‌ మండిపాటు

చైనా కొత్త చట్టంపై భారత్‌ మండిపడింది. చైనా ఏకపక్షంగా తీసుకునే నిర్ణయాలు, ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని తాజాగా భారత్‌ హెచ్చరించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్చీ ఈ మేరకు విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. 

Updated Date - 2021-10-28T08:32:51+05:30 IST