దక్షిణ సముద్రంలో చైనా దాదాగిరి!

ABN , First Publish Date - 2021-08-10T09:59:43+05:30 IST

భారత్‌ అధ్యక్షతన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సము ద్ర వాణిజ్య భద్రతపై జరిగిన చర్చ అమెరికా-చైనాల మధ్య తీవ్ర వాగ్యుద్ధానికి తెర తీసింది.

దక్షిణ సముద్రంలో చైనా దాదాగిరి!

అంతర్జాతీయ ఒప్పందాల్ని ఉల్లంఘిస్తోంది.. చైనాకు మోదీ చురకలు

ఐక్యరాజ్యసమితి, ఆగస్టు 9: భారత్‌ అధ్యక్షతన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సము ద్ర వాణిజ్య భద్రతపై జరిగిన చర్చ అమెరికా-చైనాల మధ్య తీవ్ర వాగ్యుద్ధానికి తెర తీసింది. 15 సభ్యదేశాలు పాల్గొన్న ఈ సమావేశంలో ప్రధాని మోదీ అధ్యక్షోపన్యాసం చేశారు. దక్షిణ చైనా సముద్రంలో చైనా దాదాగిరి చేస్తోందని అమెరికా రాయబారి మండిపడ్డారు. అంతర్జాతీయ ఒప్పందాలకు అనుగుణంగా నౌకల రాకపోకలు నిర్వహిస్తున్న దేశాలపై చైనా దౌర్జన్యానికి పాల్పడుతోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఈ అంశంపై అమెరికాకు మాట్లాడే అధికారమే లేదని చైనా రాయబారి బదులిచ్చారు. దక్షిణ చైనా సముద్ర దీవులపై, జలాలపై ఎలాంటి హక్కులు లేని అమెరికాకు ఈ వివాదంతో సంబంధమే లేదన్నారు. అధ్యక్షోపన్యాసం సందర్భంగా ప్రధాని మోదీ కూడా చైనాపై పరోక్షంగా చురకలు వేశారు. సముద్రాలు ప్రపంచ వారసత్వ ఆస్తులన్నారు. సముద్ర వ్యాపారానికి ఎలాంటి అడ్డంకి కలిగించినా అది అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకే ముప్పని చెప్పారు. సముద్ర మార్గాల విభేదాలను అంతర్జాతీయ ఒప్పందాలకు లోబడి, శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు. సముద్రపు దొంగల భరతం పట్టేందుకు ఐక్యరాజ్యసమితిలో ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ సూచించారు. 

Updated Date - 2021-08-10T09:59:43+05:30 IST