సరిహద్దు వివాదాల్లో మా వైఖరి మారదు : చైనా

ABN , First Publish Date - 2021-10-29T00:08:15+05:30 IST

కొత్త ల్యాండ్ బోర్డర్ చట్టం ప్రభావం ప్రస్తుత సరిహద్దు

సరిహద్దు వివాదాల్లో మా వైఖరి మారదు : చైనా

బీజింగ్ : కొత్త ల్యాండ్ బోర్డర్ చట్టం ప్రభావం ప్రస్తుత సరిహద్దు ఒప్పందాలపై ఉండబోదని చైనా పేర్కొంది. సరిహద్దులకు సంబంధించిన ప్రశ్నలపై తమ వైఖరిని ఈ కొత్త చట్టం మార్చబోదని తెలిపింది. ఈ చట్టంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో చైనా ఫారిన్ మినిస్ట్రీ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ గురువారం ఈ వివరణ ఇచ్చారు. 


చైనాకు 14 దేశాలతో సరిహద్దులు ఉన్నాయి. వీటిలో భారత దేశం ఒకటి. 22,000 కిలోమీటర్ల ఈ సరిహద్దులను స్థానిక అధికారులు, సైన్యం ఏ విధంగా పరిరక్షించాలో పేర్కొంటున్న కొత్త ల్యాండ్ బోర్డర్ చట్టాన్ని శనివారం చైనా పార్లమెంటు ఆమోదించింది. వచ్చే జనవరి 1 నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుంది. భారత్-చైనాల మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి ప్రతిష్టంభన కొనసాగుతున్న దశలో ఈ కొత్త చట్టాన్ని ఆమోదించింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ విడుదల చేసిన ప్రకటనలో, సరిహద్దుల నిర్వహణపై ప్రస్తుత ద్వైపాక్షిక ఒప్పందాలపైనా, అదేవిధంగా సరిహద్దు వివాదంపైనా ప్రభావం చూపగలిగే చట్టాన్ని తేవాలని చైనా ఏకపక్షంగా నిర్ణయించడం భారత్‌కు ఆందోళనకరమని తెలిపారు. 


భారత్ వ్యక్తం చేసిన ఆందోళనపై మీడియా గురువారం ప్రశ్నించినపుడు వాంగ్ వెన్‌బిన్ స్పందిస్తూ, చైనాలోని సాధారణ చట్టం గురించి అనుచిత ఊహాగానాలు చేయడం సంబంధిత దేశాలు మానుకుంటాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. పొరుగు దేశాలతో చైనా సహకారానికి సంబంధించిన, భూమి సరిహద్దుల విషయంలో వ్యవహరించవలసిన నిబంధనలు ఈ చట్టంలో స్పష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుత సరిహద్దు ఒప్పందాలను చైనా అమలు చేయడంపై ఈ చట్టం ఎటువంటి ప్రభావం చూపదని చెప్పారు.  పొరుగు దేశాలతో ప్రస్తుతం చైనా సహకరిస్తున్న తీరును ఈ చట్టం మార్చబోదని తెలిపారు. సరిహద్దు వివాదాలపై చైనా వైఖరిని మార్చబోదన్నారు. 


Updated Date - 2021-10-29T00:08:15+05:30 IST