టీకా కోసం కొందరు సీఎంలు బెదిరించారు!

ABN , First Publish Date - 2021-05-02T07:50:30+05:30 IST

కొవిషీల్డ్‌ టీకాలను వెంటనే సరఫరా చేయాలంటూ.. కొందరు ముఖ్యమంత్రులు, వ్యాపార దిగ్గజాలు సహా పలువురు ప్రముఖులు తనకు ఫోన్‌ చేసి బెదిరించారని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా...

టీకా కోసం కొందరు సీఎంలు బెదిరించారు!

  • కొవిషీల్డ్‌ స్టాక్‌ కోసం.. వ్యాపార దిగ్గజాలు, ప్రముఖుల వార్నింగ్‌ కాల్స్‌ 
  • ఆ వాతావరణంలో ఉండలేకే ఎక్కువ సమయం లండన్‌లో
  • టీకా ఉత్పత్తి భారమంతా నాపైనే..
  • విదేశాల్లోనూ కొవిషీల్డ్‌ ఉత్పత్తి!
  • ‘ది టైమ్స్‌’ ఇంటర్వ్యూలో అదర్‌ పూనావాలా సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, మే 1: కొవిషీల్డ్‌ టీకాలను వెంటనే సరఫరా చేయాలంటూ.. కొందరు ముఖ్యమంత్రులు, వ్యాపార దిగ్గజాలు సహా పలువురు ప్రముఖులు తనకు ఫోన్‌ చేసి బెదిరించారని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) సీఈవో అదర్‌ పూనావాలా సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న ఆయన బ్రిటన్‌లోని ‘ది టైమ్స్‌’ పత్రికకు ఇచ్చిన  ఇంటర్వ్యూలో ఈ వివరాలను వెల్లడించారు.  ‘‘నువ్వు మాకు వ్యాక్సిన్‌ పంపకుంటే బాగుండదని వాళ్లు బెదిరిస్తున్నారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని అంటున్నారు. మమ్మల్ని దిగ్బంధించి, కార్యకలాపాలు సాగించకుండా నిలువరించే దురుద్దేశం వాళ్ల బెదిరింపుల్లో కనిపిస్తోంది’’ అని పూనావాలా చెప్పారు. ‘‘భారత్‌లో ఆ దుస్థితిని నేరుగా ఎదుర్కోకూడదనే ఉద్దేశంతోనే నేను ఎక్కువ సమయాన్ని లండన్‌లో గడుపుతున్నాను. ఎక్స్‌, వై, జెడ్‌లకు టీకాలను సరఫరా చేయలేకపోతే.. వారు ఏం చేస్తారో ఊహించదల్చుకోలేదు’’ అని పేర్కొన్నారు. కాగా, బ్రిటన్‌ సహా పలు విదేశాల్లోనూ టీకాల తయారీని ప్రారంభించే యోచనలో ఉన్నట్లు పూనావాలా వెల్లడించారు. ఇంకొన్ని రోజుల్లోనే దీనిపై కీలక ప్రకటన చేస్తామన్నారు.  


Updated Date - 2021-05-02T07:50:30+05:30 IST