7 వరకు కఠిన లాక్‌డౌన్
ABN , First Publish Date - 2021-05-29T17:53:26+05:30 IST
రాష్ట్రంలో సడలింపులు లేని కఠిన లాక్‌డౌన్ జూన్ 7వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది..
వాహనాల్లో కూరగాయలు, కిరాణా సరుకులు
త్వరలో రేషన్ కార్డుదారులకు ఉచితంగా కిరణా సరుకులు
చెన్నై: రాష్ట్రంలో సడలింపులు లేని కఠిన లాక్‌డౌన్ జూన్ 7వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.. కఠినలాక్‌డౌన్‌లో ఈసారి కాయగూరలతో పాటు, కిరాణా సరకులను కూడా వాహనాల్లో విక్రయించనున్నట్లు ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తి కారణంగా కేంద్ర ప్రభుత్వం, జాతీయ విపత్తుల నివారణ చట్టం ప్రకారం గతేడాది మార్చి 25 నుంచి రాష్ట్రంలో కఠిన, సడలింపులతో కూడిన లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 22న జరిగిన అఖిలపక్ష సభ్యుల సలహా కమిటీ, వైద్య నిపుణల కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఉగ్రరూపం దాల్చిన కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి ఈ నెల 24 నుంచి కఠిన లాక్‌డౌన్ విధించాల్సిన అవసరం ఏర్పడిందని స్టాలిన్ పేర్కొన్నారు. ఈ లాక్‌డౌన్ ఈ నెల 31 ఉదయం ఆరుగంటలకు ముగియనుండగా జిల్లాల వారీగా వైరస్ వ్యాప్తిని, కరోనా బాధితుల సంఖ్యను పరిశీలించిన మీదట కఠిన లాక్‌డౌన్‌ను జూన్ 7వ తేదీ ఉదయం 6 గంటల వరకు పొడిగిస్తు న్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం వ్యవసాయ శాఖ, ఉద్యానవనాల శాఖ ఆధ్వర్యంలో వాహనాల్లో కాయగూరల విక్రయాలను కొనసాగిస్తున్నామని, అదేవిధంగా ఆయా ప్రాంతాల్లోని స్థానిక సంస్థల అధికారుల అనుమతితో ఆయా ప్రాంతాల్లోని కిరాణా దుకాణాల ద్వారా వాహనాల్లో, తోపుడు బండ్లలో కిరాణా సరకులను రోజూ ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు విక్రయిస్తారని సీఎం పేర్కొన్నారు.
బియ్యంకార్డుదారులకు సరకులు...
లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులకు గురయ్యే నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబీకులను ఆదుకునే విధంగా బియ్యం రేషన్ కార్డుదారులందరికీ జూన్ నుంచి 13 రకాల కిరాణా సరకులతో సంచులను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు స్టాలిన్ తెలిపారు. వైరస్ వ్యాప్తి ఉగ్రరూపం దాల్చటం వల్లే కఠిన లాక్‌డౌన్ పొడిగించాల్సి వచ్చిందనే విషయాన్ని మరువకుండా రాష్ట్ర ప్రజలంతా ఇంటివద్దే ఉంటూ వైరస్ కట్టడికి సాయపడాలని, ఆయన విజ్ఞప్తి చేశారు.
3 జిల్లాలకు ప్రత్యేక అధికారులు...
కోయంబత్తూరు, తిరుప్పూరు, ఈరోడ్ జిల్లాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు గాను సీనియర్ ఐఏఎస్ అధికారులు ముగ్గురుని ప్రత్యేక అధికారులుగా సీఎం స్టాలిన్ నియమించారు. వాణిజ్య నగరాలైన కోయం బత్తూరు, తిరుప్పూరు, ఈరోడ్ జిల్లాల్లో రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గురువారం కోయంబత్తూరు జిల్లాలో 4,734 పాజిటివ్ కేసులు, తిరుప్పూరుజిల్లాలో 2,074, ఈరోడ్ జిల్లాలో 1,699 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న ఆరు జిల్లాలకు చెందిన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సింగ్ నిర్వహించి కేసులు అధికంగా ఉన్న కోవై, తిరుప్పూరు, ఈరోడ్ జిల్లాలకు ముగ్గురు ప్రత్యేక అధికారులను నియమిం చారు. ఆ మేరకు కోయంబత్తూరు జిల్లాకు వాణిజ్యపన్నుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.ఏ. సిద్ధిఖ్, తిరుప్పూరుకు వ్యవసాయశాఖ కార్యదర్శి సి. సమయమూర్తి, ఈరోడ్ జిల్లాకు సర్వే, భూమిపన్నుల పథకం అమలు కమిషనర్ డాక్టట్ ఆర్.సెల్వరాజ్ నియమితులయ్యారు.
ఈ ముగ్గురు ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన జిల్లాల్లో వైరస్‌ను కట్టడి చేయడానికి తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై స్థానిక అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యంగా మూడు జిల్లాల్లోనూ ఆర్టీపీసీఆర్ పరీక్షలను అధికం చేయడం, కంటైన్‌మెంట్‌జోన్లలో వైరస్ వ్యాప్తిని అధికం కాకుండా అడ్డుకట్టవేయడం తదితర చర్యలు తీసుకోనున్నారు.
ఆరు జిల్లాలపై దృష్టిపెట్టండి
రాష్ట్రం మొత్తంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నా.. ఆరు జిల్లాల్లో మాత్రం రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతుండడం పట్ల సీఎం స్టాలిన్ దృష్టి సారించారు. ఆ జిల్లాల్లో పాజిటివ్ కేసులు అదుపులోకి వచ్చేందుకు తగిన చర్యలు తీసు కోవాలని, మరణాల సంఖ్య సైతం తగ్గేలా యుద్ధప్రాతి పదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కోవై సహా తిరుప్పూరు, ఈరోడ్, మదురై, తిరుచ్చి, సేలం జిల్లాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా స్టాలిన్ చర్యలు చేపట్టారు
చెన్నైని దాటేసిన కోవై
రోజువారీ పాజిటివ్ కేసుల నమోదులో గత కొన్ని రోజులుగా చెన్నై మొదటి స్థానంలో ఉండేది. ప్రభుత్వం అమలు చేస్తున్న కఠిన లాక్‌డౌన్ కారణంగా చెన్నైలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా మూడు వేల దిగువకు పడిపోయింది. అదేసమయంలో కోయంబత్తూరు మాత్రం రెండు రోజులుగా చెన్నైను అధిగమించి, మొదటిస్థానాన్ని ఆక్రమించింది. రోజుకు 5 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో అప్రమత్త మైన కోవై జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి, కఠిన చర్యలకు ఉపక్రమించింది. లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయా ల్సిందిగా పోలీసులను ఆదేశించింది. అదేవిధంగా మదురైలో కూడా పాజిటివ్ కేసుల సంఖ్య అధికంగా నమోదువుతున్నాయి. ఈ జిల్లాలో ఇప్పటివరకు 846 మంది కరోనా రోగులు మృత్యువాతపడ్డారు. దీంతో ఇంటింటికి జ్వరపరీక్షలు చేపట్టారు. అలాగే, 18 యేళ్ళకు పైబడిన వారికి వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని కూడా ఉధృతం చేశారు. ముఖ్యంగా కరోనా మరణాలను తగ్గించేందుకు వీలుగా అన్ని రకాలైన వైద్య సేవలను 24 గంటల పాటు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకున్నారు.