ఇంత దారుణమైన బడ్జెట్ ఎప్పుడూ చూడలేదు: చిదంబరం

ABN , First Publish Date - 2021-02-02T00:38:36+05:30 IST

కేంద్ర బడ్జెట్-2021పై కాంగ్రెస్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం విమర్శలు..

ఇంత దారుణమైన బడ్జెట్ ఎప్పుడూ చూడలేదు: చిదంబరం

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్-2021పై కాంగ్రెస్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం విమర్శలు గుప్పించారు. గతంలో ఎన్నడూ లేనంతగా దారుణంగా నిరాశ పరిచిందని అన్నారు. రక్షణ రంగానికి కేటాయింపులు ఏవని నిలదీశారు. సోమవారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, బడ్జెట్‌లో రక్షణ రంగానికి కేటాయింపులు పెంచలేదని మండిపడ్డారు. రక్షణ రంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం లేదా అని నిలదీశారు. రక్షణ రంగానికి కేవలం రూ.4,000 కోట్లు కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు.


ప్రజారోగ్యంపై కేటాయింపులన్నీ లెక్కల గారడీనే..

ప్రజారోగ్యానికి బడ్జెట్ కేటాయింపులన్నీ కేవలం లెక్కల గారడీయేనంటూ ఆయన కొట్టిపారేశారు. వ్యాక్సినేషన్ వన్ టైమ్ కాస్ట్‌ను ఆమె (నిర్మలా సీతారామన్) చేర్చారని, వాస్తవానికి ఆరోగ్యానికి బడ్జెట్ కేటాయింపులు తగ్గాయని అన్నారు. వ్యవసాయరంగంపై మాట్లాడుతూ, వ్యవసాయరంగ కేటాయింపులు కూడా తగ్గాయని అన్నారు. రైతుల ఆదాయం ఎలా రెట్టింపు చేస్తారో కూడా చెప్పలేదన్నారు. లిబరల్ (వడ్డీలేని) రుణాల ప్రస్తావనే లేదని విమర్శించారు. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులనేవే లేకుంటే ఆర్‌డీఐఎఫ్ నిధులు, విద్యారుణాలు, వ్యవసాయ రుణాలు ఎక్కడివి? వాళ్ల (బీజేపీ) హయాం ముగిసేనాటికి, ప్రభుత్వరంగ బ్యాంకులన్నింటినీ పూర్తిగా అమ్మేస్తారు' అని చిదంబరం విమర్శించారు.


బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని 74 శాతం పెంచడం బాగానే కనిపిస్తోందని అన్నారు. అయితే తాము అప్పట్లో 20 శాతం ఎఫ్‌డీఐని అనుమతిస్తామని అన్నప్పుడు విపక్షాలు వ్యతిరేకించాయని గుర్తు చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు ప్రస్తావనే లేదని అన్నారు. మౌలిక వసతులపై పెట్టుబడులు పెట్టాల్సిందేనని, అయితే పేదలు, కార్మికవర్గం, మధ్యతరగతి వర్గానికి కూడా సమానమైన వెయిటేజ్ ఇవ్వాలని అన్నారు. మొత్తంగా చూసినప్పుడు ఇంత నిస్సహాయ బడ్జెట్, ఏమాత్రం అంచనాలను నిలుపుకోని బడ్జెట్ గతంలో ఎన్నడూ చూడలేదని చిదంబరం అన్నారు.

Updated Date - 2021-02-02T00:38:36+05:30 IST