లండన్‌కు మళ్లీ విమాన సర్వీసులు

ABN , First Publish Date - 2021-09-02T16:27:55+05:30 IST

బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ ఎనిమిది నెలల విరామం తర్వాత లండన్‌ నుంచి చెన్నై నగరానికి మళ్లీ విమాన సేవలను బుధవారం ప్రారంభించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో ఢిల్లీ,

లండన్‌కు మళ్లీ విమాన సర్వీసులు

చెన్నై: బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ ఎనిమిది నెలల విరామం తర్వాత లండన్‌ నుంచి చెన్నై నగరానికి మళ్లీ విమాన సేవలను బుధవారం ప్రారంభించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో ఢిల్లీ, ముంబయి, బెంగుళూరు నగరాలకు మాత్రమే విమానాలు నడుపుతున్న బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ.. ఇప్పుడు చెన్నైకి కూడా ప్రారంభించడం విశేషం. ఆ మేరకు లండన్‌ నుంచి బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ విమానం 189 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బంది సహా మొత్తం 203 మందితో బుధవారం వేకువజామున 4 గంటలకు స్థానిక అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. ఈ విమానం మళ్ళీ గురువారం ఉదయం 5.30 గంటలకు లండన్‌ బయలుదేరనుంది. బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ ఆది, బుధ, శుక్రవారాల్లో వారానికి మూడు రోజుల చొప్పున లండన్‌ నుంచి విమానాలను నడుపనుంది. మరుమార్గంలో చెన్నై నుంచి సోమ, గురు, శనివారాల్లో లండన్‌కు విమానాలు నడుపనుంది. చెన్నై, లండన్‌ నగరాల మధ్య ప్రస్తుతం వారానికి మూడు విమానాలు నడుపుతున్న ఈ సంస్థ ప్రయాణికుల రద్దీ అధికమైతే వారానికి ఐదు విమానాలు నడిపేందుకు సిద్ధంగా వుందని అధికారులు తెలిపారు. ఇదిలా వుండగా బుధవారం వేకువజాము లండన్‌ నుంచి వచ్చిన విమాన ప్రయాణికులందరికీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించారు. వ్యాక్సిన్‌ వేసుకున్నట్లు సర్టిఫికెట్లు వున్నప్పటికీ ఆర్టీ- పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించిన తరువాతే ప్రయాణికులను అనుమతిస్తున్నట్టు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. 

Updated Date - 2021-09-02T16:27:55+05:30 IST