Red alert:4 జిల్లాల్లో నేడు భారీవర్షాలు...ముగ్గురి మృతి

ABN , First Publish Date - 2021-12-31T12:54:50+05:30 IST

తమిళనాడు రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో భారీవర్షాల నేపథ్యంలో కేంద్రవాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది...

Red alert:4 జిల్లాల్లో నేడు భారీవర్షాలు...ముగ్గురి మృతి

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో భారీవర్షాల నేపథ్యంలో కేంద్రవాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. చెన్నై నగరంలో గాలివాన బీభత్సం వల్ల విద్యుదాఘాతం కారణంగా ముగ్గురు వ్యక్తులు మరణించారు. భారీవర్షాలు కురుస్తుండటంతో చెన్నైనగరంలోని పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి నెలకొంది. విద్యుదాఘాతం వల్ల ఒట్టేరి ప్రాంతానికి చెందిన 70 ఏళ్ల తమిళరసి, మైలాపూర్‌లో 13 ఏళ్ల బాలుడు, 45 ఏళ్ల మహిళ మరణించారు. తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్‌పేట జిల్లాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. నాలుగు జిల్లాల్లో శుక్రవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు.


అంతకుముందు ఊహించని వర్షాల కారణంగా చెన్నైలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది.నాలుగు సబ్‌వేలను మూసివేశామని, ట్రాఫిక్ రద్దీకి దారితీసే  ఏడు ప్రాంతాలను గుర్తించామని చెన్నై ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.‘‘భారీ వర్షం, వరదల కారణంగా రెడ్‌హిల్స్ ట్యాంక్ నుంచి ముందుజాగ్రత్త చర్యగా 750 క్యూసెక్కుల నీటిని విడుదల చేశాం, ఇన్‌ఫ్లో సుమారు 2000 క్యూసెక్కులు ఉంది. కాలువ ఒడ్డున లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’’అని తిరువళ్లూరు కలెక్టర్‌ ట్వీట్‌ చేశారు.చెంబ్రంబాక్కం జలాశయం నుంచి 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు సమాచారం.మరోవైపు చెన్నై మెట్రో రైలు సేవలను గంటపాటు పొడిగించారు. చెన్నై నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రయాణికులు సురక్షితంగా తమ ఇళ్లకు చేరుకోవడం కోసం మెట్రోరైలు సేవలను పొడిగించారు.


Updated Date - 2021-12-31T12:54:50+05:30 IST