వరుస అల్పపీడనాలు...

ABN , First Publish Date - 2021-12-01T13:36:34+05:30 IST

దక్షిణ అండమాన్‌ సముద్రంలో రాగల 12 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ కారణంగా దక్షిణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ

వరుస అల్పపీడనాలు...

- రానున్న రెండు నెలల్లో ఏడు ! 

- దక్షిణ అండమాన్‌లో మరో వాయుగుండం

- జనవరి 24 వరకు వర్షాలే 

- వాతావరణ శాఖ అంచనా


అడయార్‌(చెన్నై): దక్షిణ అండమాన్‌ సముద్రంలో రాగల 12 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ కారణంగా దక్షిణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. అంతేకాకుండా, వచ్చే జనవరి 24వ తేదీ వరకు వారానికొకటి చొప్పున అల్పపీడనాలు ఏర్పడవచ్చని, దాని కారణంగా జనవరి 24వ తేదీ వరకు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు మరింత బలపడ్డాయి. వీటి కారణంగా గత నెల రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వీటికితోడు బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో అపుడపుడూ అల్పపీడనంతో పాటు ఉపరితల ఆవర్తన ద్రోణుల ప్రభావంతో రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలన్నీ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. కొద్దిరోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు నగరంలోని అన్ని ప్రాంతాల్లోకి నీరు చేరింది. తాజాగా దక్షిణ అండమాన్‌ సమీపంలో, మధ్యపశ్చిమ అరేబియా సముద్రంలో బుధవారం ఒక్కరోజే రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశం వుందని వాతావారణ కేంద్రం తెలిపింది. ఇందులో భాగంగా మదటి అల్పపీడనం రాగల 12 గంటల్లో దక్షిణ అండమాన్‌ సమీ పంలో బంగాళాఖాతంలో ఏర్పడవచ్చని పేర్కొంది. ఇది మరింతగా బలపడి వాయుగుండంగా మారనుంది. ఈ కారణంగా రాష్ట్రంలోని దక్షిణాది జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. 

     దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ఈనెల రెండో తేదీకి మరింత బలపడనుంది. ఆ తర్వాత ఈ నెల 6, 7 తేదీల్లో వర్షం ఉండదు. అయితే, 7, 8 తేదీల్లో దక్షిణ అండమాన్‌లోనే మరో అల్పపీడనం ఏర్పడి, ఇది 9వ తేదీ పశ్చిమదిశగా పయనించి, 10, 11, 12 తేదీల్లో శ్రీలంక, తమిళనాడు వైపు దూసుకురానుంది. ఈ కారణంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షం పడవచ్చని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత డిసెంబరు 15వ తేదీ వర్షం లేకుండా వాతావరణం పొడిగా ఉంటుంది. 16వ తేదీ నుంచి 22వ తేదీల మధ్య మరో అల్పపీడనం ఏర్పడి, వర్షం పడే అవకాశం ఉంది. 26వ తేదీ తర్వాత మరో అల్పపీడనం ఏర్పడి డిసెంబరు 26 నుంచి జనవరి 3వ తేదీ వరు వర్షం పడుతుందని తెలిపింది. ఒక్క డిసెంబరు నెలలోనే 4 అల్పపీడనాలు, జనవరి నెలలో 3 అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలున్నాయని, వీటి కారణంగా జనవరి 24వ తేదీ వరకు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం అంచనావేసింది.

Updated Date - 2021-12-01T13:36:34+05:30 IST