చెన్నైకి 2.75 లక్షల వ్యాక్సిన్లు

ABN , First Publish Date - 2021-05-05T13:25:55+05:30 IST

రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ల కార్యక్రమం జనవరి 16వ తేదీ నుంచి ప్రారంభం కాగా, ఇప్పటికే లక్షలాది మందికి ఈ వ్యాక్సిన్లు వేశారు. దీంతో పలు ప్రాంతాల్లో వ్యాక్సిన్ల కొరత ఏర్పడింది. ఈ

చెన్నైకి 2.75 లక్షల వ్యాక్సిన్లు

- ముంబై, హైదరాబాద్‌ నుంచి రాక  

- ఇంగ్లండ్‌ నుంచి ఆక్సిజన్‌ సిలిండర్ల దిగుమతి


అడయార్‌(చెన్నై): రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ల కార్యక్రమం జనవరి 16వ తేదీ నుంచి ప్రారంభం కాగా, ఇప్పటికే లక్షలాది మందికి ఈ వ్యాక్సిన్లు వేశారు. దీంతో పలు ప్రాంతాల్లో వ్యాక్సిన్ల కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌, ముంబై మహానగరాల నుంచి ప్రత్యేక విమానాల్లో 2.75 లక్షల వ్యాక్సిన్లు మంగళవారం నగరానికి చేరుకున్నాయి. అదేవిధంగా ఇంగ్లండ్‌ నుంచి ఆక్సిజన్‌ సిలిండర్లు భారత వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానం లో వచ్చాయి. రాష్ట్రంలో జనవరి 16 నుంచి ప్రారంభమైన కరోనా వ్యాక్సి నేషన్‌ డ్రైవ్‌లో ఇప్పటివరకు 60 లక్షల మందికి ఈ వ్యాక్సిన్లు వేశారు. ఈ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌కు ఎలాంటి అవాంతరాలు లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో కరోనా వైరస్‌ రోగుల సంఖ్య ఎక్కువై పోతోంది. అందువల్ల తక్షణం మరో 20 లక్షల కరోనా టీకాలను పంపించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో రాష్ట్రానికి కోవాగ్జిన్‌, కోవిషీల్డు టీకాలను పంపిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ముంబై నుంచి 2 లక్షల కోవిషీల్డు టీకాలు రాగా, హైదరాబాద్‌ నుంచి మరో 75 వేల కోవాగ్జిన్‌ వ్యాక్సిన్లు వచ్చాయి. దీనిపై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతా ధికారులు స్పందిస్తూ, రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌కు ఎలాంటి అవాంతరాలు లేకుండా సాగుతోందన్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు 2.75 లక్షల టీకాలు వచ్చాయని, మరో 7.50 లక్షల టీకాలు ఒకటి రెండు రోజుల్లో వస్తాయని వారు తెలిపారు. 


ఇంగ్లండ్‌ నుంచి ఆక్సిజన్‌ సిలిండర్లు 

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1.24 లక్షల మంది కరోనా రోగులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఒక్క చెన్నై మహానగరంలోనే సుమారుగా 32 వేల మంది రోగులు ఉన్నారు. వీరిలో 60 శాతం మంది రోగులు శ్వాస సమస్య తో బాధపడుతున్నారు. వీరికి ఆక్సిజన్‌ సాయంతోనే చికిత్స అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని దృష్టిలో వుంచుకుని ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అవసరమైన ఆక్సిజన్‌ సిలిండర్లను దిగుమతి చేసుకుని నిల్వ ఉంచుతోంది. అదేసమయంలో రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగు తుండటంతో కేంద్రం కూడా మరిన్ని సిలిండర్లను అందించేందుకు ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా లండన్‌ నుంచి ప్రత్యేక విమానం లో 450 ఆక్సిజన్‌ సిలిండర్లు మంగళవారం ఉదయం 8 గంటలకు నగరానికి వచ్చాయి. ఒక్కో సిలిండర్‌ బరువు 65 కిలోలు కలిగివుంది. వీటితో కలుపుకుని కేంద్రం వాటాగా రాష్ట్రానికి ఇప్పటి వరకు 29,250 ఆక్సిజన్‌ సిలిండర్లు రాష్ట్రానికి వచ్చాయి. ఈ సిలిండర్లు విమానాశ్రయానికి వచ్చిన 15 నిమిషాల్లోనే కస్టమ్స్‌ అధికారులు క్లియరెన్స్‌ ఇచ్చేశారు. ఆ తర్వాత వాటిని ప్రత్యేక లారీల్లో పోలీసుల రక్షణలో అవసరమైన ఆస్పత్రులకు తరలించారు. వీటిని అవసరమైన ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు అందజేయనున్నారు. 

Updated Date - 2021-05-05T13:25:55+05:30 IST