తరుముకొస్తున్న బర్డ్‌ఫ్లూ

ABN , First Publish Date - 2021-01-08T07:29:43+05:30 IST

బర్డ్‌ఫ్లూ ఉపద్రవం ముంచుకొస్తోందా?.. ఒక్కో రాష్ట్రాన్నీ చుట్టబెడుతోందా?.. వీటికి కేంద్ర ప్రభుత్వం నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోడానికి సిద్ధం కావాలని అన్ని రాష్ట్రాలకూ సూచించింది. బర్డ్‌ఫ్లూ సోకిన

తరుముకొస్తున్న బర్డ్‌ఫ్లూ

  • ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండండి
  • రాష్ట్రాలకు కేంద్రం సూచన
  •   కేరళలో 61వేల పక్షుల వధ


అహ్మదాబాద్‌, జనవరి 7: బర్డ్‌ఫ్లూ ఉపద్రవం ముంచుకొస్తోందా?.. ఒక్కో రాష్ట్రాన్నీ చుట్టబెడుతోందా?.. వీటికి కేంద్ర ప్రభుత్వం నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోడానికి సిద్ధం కావాలని అన్ని రాష్ట్రాలకూ సూచించింది. బర్డ్‌ఫ్లూ సోకిన వాటిని వధించడానికి అవసరమైన ఏర్పాట్లతో సంసిద్ధులై ఉండాలని తెలిపింది. ఆ వైర్‌సపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొంది. జలవనరులు, కోళ్లఫాంలు, జంతు ప్రదర్శన కేంద్రాలు, వలస పక్షుల ఆవాస స్థలాలు, మాంసాహార మార్కెట్లు వంటి వాటిపై నిరంతర పర్యవేక్షణ ఉంచాలని పేర్కొంది. గుడ్లు, మాంసాన్ని బాగుగా ఉడికించిన తర్వాతే తినే విధంగా ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని సూచించింది.


రాష్ట్రాలతో నిరంతర సమన్వయం, తగు సూచనల జారీ కోసం ఢిల్లీలో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. ఇప్పటికే కేరళ, హరియాణాలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాలను పంపింది. ఒక బృందం గురువారం కేరళ చేరుకొంది. కేరళ నుంచి కర్ణాటకకు వైరస్‌ వ్యాపించినట్లు తెలుస్తోంది. సరిహద్దు జిల్లా దక్షిణ కన్నడలోని ఆరు కాకులు చనిపోయాయి. వాటిని వైద్య పరీక్షలకు పంపించారు. దీంతో ఆ జిల్లాతోసహా కొడగు, మైసూరు, చామరాజనగర్‌ తదితర జిల్లాలను అప్రమత్తం చేశారు.


గుజరాత్‌లోని  మొథేరాలోసూర్యదేవాలయం సమీపంలో చనిపోయిన నాలుగు కాకులను స్థానికులు గురువారం గుర్తించారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వైద్య పరీక్షల నిమత్తం భోపాల్‌లోని ల్యాబ్‌కు పంపించారు.  రెండు రోజుల్లో మరణించిన వాటి సంఖ్య 8కి చేరింది.


మరోవైపు.. కేరళలో  బాతులు, కోళ్లతోసహా 61వేలకుపైగా పక్షులను వధించారు. రెండు నెలలలోపు వాటికి రూ.100, ఆపై వయసున్న వాటికి రూ.200, ధ్వంసం చేసిన గుడ్లకు రూ.5చొప్పున ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లిస్తోంది. కాగా, బర్డ్‌ఫ్లూ వైరస్‌ పక్షుల నుంచి పక్షులకు, మనుషులకు సోకుతుంది. మనుషుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందదు.

అయితే, బర్డ్‌ఫ్లూ సోకిన 10 మందిలో ఆరుగురు మృత్యువాత పడే అవకాశం ఉందని నివేదికలు చెబుతుండడం అత్యంత ఆందోళన కలిగించే అంశం.


Updated Date - 2021-01-08T07:29:43+05:30 IST