సొరంగాల నిర్మాణంలో పాకిస్థాన్ భారీ ప్రణాళిక : బీఎస్ఎఫ్

ABN , First Publish Date - 2021-01-13T23:13:21+05:30 IST

భారత దేశంలోకి ఉగ్రవాదులను పంపించడమే లక్ష్యంగా సరిహద్దుల్లో

సొరంగాల నిర్మాణంలో పాకిస్థాన్ భారీ ప్రణాళిక : బీఎస్ఎఫ్

కథువా : భారత దేశంలోకి ఉగ్రవాదులను పంపించడమే లక్ష్యంగా సరిహద్దుల్లో సొరంగాలను పాకిస్థాన్ నిర్మిస్తోందని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) పేర్కొంది. నైపుణ్యంతో కూడిన ఇంజినీరింగ్ టెక్నిక్స్‌తో ఈ సొరంగాలను ఉద్దేశపూర్వకంగా పాకిస్థాన్ నిర్మిస్తోందని, జమ్మూ-కశ్మీరులోని కథువా, సాంబా జిల్లాల్లో వీటిని గుర్తించామని తెలిపింది. 


బీఎస్ఎఫ్ జమ్మూ ఫ్రాంటియర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఎన్ఎస్ జమ్వాల్ బుధవారం మాట్లాడుతూ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కథువా జిల్లా, హీరానగర్ సెక్టర్‌లో ఓ సొరంగాన్ని గుర్తించినట్లు తెలిపారు. దీని పొడవు  150 మీటర్లని తెలిపారు. ఇంజినీరింగ్ నైపుణ్యంతో ఈ సొరంగాన్ని నిర్మించినట్లు తెలిపారు. భారత దేశంలోకి ఉగ్రవాదులను పంపించడమే లక్ష్యంగా పాకిస్థాన్ ప్రణాళికాబద్ధంగానే ఈ సొరంగాలను నిర్మిస్తోందన్నారు. దీనిని గడచిన కొద్ది రోజుల్లో ఉపయోగించినట్లు కనిపించలేదన్నారు. గత కొన్ని నెలల్లో తాము దాదాపు 10 సొరంగాలను గుర్తించామని చెప్పారు. కథువా జిల్లాలో రెండు, మూడు సొరంగాలను గుర్తించామన్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనడానికి తాము అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు. 


బుధవారం ఉదయం 10.30 గంటలకు హీరానగర్ సెక్టర్‌లోని బొబియా బీఎస్ఎఫ్ ఔట్‌పోస్ట్  ప్రాంతంలో ఓ సొరంగాన్ని గుర్తించినట్లు తెలిపారు. యాంటీ టన్నెలింగ్ పార్టీ దీనిని గుర్తించిందన్నారు. జీరో లైన్ నుంచి సుమారు 90 మీటర్ల దూరంలో, మన వైపున ఉన్న కంచె నుంచి 20 మీటర్ల దూరంలో దీనిని గుర్తించినట్లు చెప్పారు. భారత దేశం వైపు బయట దారిని పాకిస్థాన్‌లో తయారైన ఇసుక బస్తాలతో మూసివేశారని తెలిపారు. 


Updated Date - 2021-01-13T23:13:21+05:30 IST