నిధులివ్వలేకనే దళిత బంధుకు బ్రేక్
ABN , First Publish Date - 2021-10-20T08:48:58+05:30 IST
దళితబంధు కింద నిధులు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతోనే సీఎం కేసీఆర్, హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ పథకాన్ని నిలిపివేయించారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు.

ఏం లాబీయింగ్ చేశారో.. కేసీఆరే ఆపేశారు: అర్వింద్
హైదరాబాద్/న్యూఢిల్లీ/హుజూరాబాద్, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): దళితబంధు కింద నిధులు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతోనే సీఎం కేసీఆర్, హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ పథకాన్ని నిలిపివేయించారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. రాష్ట్రాన్ని దివాళా తీయించిన కేసీఆర్, నిధులు ఇవ్వలేక, ఏమి లాబీయింగ్ చేశారోగానీ.. ఆయనే ఈ పథకాన్ని ఆపించుకున్నారని అన్నారు. ఒకవేళ ఆయన అలా చేయకపోతే ఇతర నియోజకవర్గాల్లో దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దృష్ట్యా, తెలంగాణలో దళిత బంధు అమలు అసాధ్యమని ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు తనతో చెప్పారని అర్వింద్ వెల్లడించారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అర్వింద్ మీడియాతో మాట్లాడారు. అకౌంట్లు ఫ్రీజ్ చేయడాన్ని తాము తప్పుబడితే, నకిలీ లేఖ సృష్టించి, తామే దళిత బంధును ఆపించినట్లు టీఆర్ఎస్ ప్రచారం చేసిందని ఆరోపించారు. హుజూరాబాద్‌లో దళిత బంధు పథకాన్ని నిలిపివేయడానికి సీఎం కేసీఆరే కారణమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. మంగళవారం ఆమె ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. హుజూరాబాద్‌లో రెండు నెలలుగా దళిత బంధును అమలు చేయకుండా ఏం చేశారని ప్రశ్నించారు. బంధు అంటూనే బంద్ చేయించి వెన్ను విరగ్గొట్టడం ఎలాగో సీఎం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య అని బీజేపీ నేత విజయశాంతి ట్విటర్ వేదికగా విమర్శించారు. దళిత బంధు ఆపాలని తాను కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయలేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి అన్నారు.
నేటి నుంచి బీజేపీ నేతల విస్తృత ప్రచారం
హుజూరాబాద్‌లో బుధవారం నుంచి తమ పార్టీ నాయకులు ఈటల రాజేందర్ తరఫున విస్తృత ప్రచారం చేస్తారని గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు. ఎంపీ బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, డీకే అరుణ, జితేందర్ రెడ్డి, వివేక్, విజయశాంతి, బాబుమోహన్ తదితరులు ప్రచారంలో పాల్గొంటారని ఆయన వివరించారు.