యూపీకి బి.ఎల్. సంతోశ్... యూపీలో ఏం జరగబోతోంది?

ABN , First Publish Date - 2021-05-30T22:23:49+05:30 IST

ఆరెస్సెస్ సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబళేతో ప్రధాని మోదీ, అమిత్‌షా, నడ్డా భేటీ జరిగిన తర్వాత

యూపీకి బి.ఎల్. సంతోశ్... యూపీలో ఏం జరగబోతోంది?

లక్నో : ఆరెస్సెస్ సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబళేతో ప్రధాని మోదీ, అమిత్‌షా, నడ్డా భేటీ జరిగిన తర్వాత యూపీలో కీలక మార్పులు జరగబోతున్నాయి. కొన్ని రోజుల క్రితం ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో ఆరెస్సెస్ కీలక నేత దత్తాత్రేయ హోసబళే భేటీ అయ్యారు. ఈ భేటీ మొత్తం యూపీ రాజకీయం చుట్టే తిరిగింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, దత్తాత్రేయ హోసబళే బీజేపీ నేతలకు ఓ రోడ్ మ్యాప్ ఇచ్చారు. ఇందులో మంత్రివర్గంలో మార్పులు, చేర్పులతో పాటు, బీజేపీలో సమూల మార్పులు తేవాలన్నది ఆ రోడ్‌మ్యాప్ సారాంశం. 


దీనికి అనుగుణంగానే యూపీ బీజేపీ, సీఎం యోగి మార్పులకు సిద్ధపడిపోయారు. ఇందులో భాగంగా సోమవారం యూపీలో కేబినెట్ విస్తరణ జరగనున్నట్లు సమాచారం. విస్తరణా? మార్పులు చేర్పులా? అన్న విషయంలో మాత్రం క్లారిటీ లేదు కానీ... సోమవారం మాత్రం యూపీలో ఏదో జరగబోతోందన్నది మాత్రం ఖాయం. బీజేపీ జాతీయ సంఘటనా కార్యదర్శి బి.ఎల్. సంతోశ్ సోమవారం యూపీకి వెళ్లనున్నారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి, యూపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి రాధా మోహన్ సింగ్ కూడా యూపీకి వెళ్లనున్నారు. వీరిద్దరు యూపీకి వెళ్తుండటంతో యూపీలో ఏదో మార్పులు తథ్యమని అందరూ భావిస్తున్నారు. మంత్రివర్గ కూర్పుతో పాటు బీజేపీలో కూడా కీలక మార్పులు చేపట్టడానికే జాతీయ సంఘటనా కార్యదర్శి బి.ఎల్. సంతోశ్ యూపీకి వెళ్తున్నారని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. 


అంతేకాకుండా బి.ఎల్. సంతోశ్ సోమవారం బీజేపీ నేతలతో వరుస సమావేశాలు కూడా నిర్వహించనున్నారు. బీజేపీ నేతలతో భేటీ జరిగిన తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలతో కూడా బి.ఎల్. సంతోశ్ భేటీ నిర్వహించనున్నారు.  అంతేకాకుండా ప్రధాని మోదీ అతి త్వరలోనే మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా యూపీకి పెద్దపీట వేయాలని మోదీ తలపోస్తున్నారు. ఎందుకంటే వచ్చే యేడాది యూపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గంలోయూపీ నేతలకు పెద్ద పీట వేయాలని మోదీ డిసైడ్ అయ్యారు. ఈ  విషయంపై కూడా బి.ఎల్. సంతోశ్ ఎమ్మెల్యేలు, నేతల అభిప్రాయాలు తీసుకోనున్నట్లు సమాచారం. 

Updated Date - 2021-05-30T22:23:49+05:30 IST