బీజేపీకి వ్యతిరేకంగా ‘సై’.. కాంగ్రెస్ రహితంగా ‘నై’
ABN , First Publish Date - 2021-12-15T06:33:32+05:30 IST
తెలంగాణ సీఎం కేసీఆర్ తమిళనాడు పర్యటన మళ్లీ కొత్త పొత్తులపై చర్చకు దారి తీసింది. మూడేళ్ల క్రితం చెన్నై వచ్చిన కేసీఆర్ ‘ఫెడరల్ ఫ్రంట్’ ఏర్పాటుపై ...

ఇదే డీఎంకే వైఖరి.. ఫెడరల్ ఫ్రంట్‌పై అనాసక్తి
తమిళనాట కాంగ్రెస్ లేకుంటే నష్టపోతామని భయం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నమ్మని స్టాలిన్
ఇదే డీఎంకే వైఖరి..
ఫెడరల్ ఫ్రంట్‌పై అనాసక్తి
కేసీఆర్‌ను నమ్మని స్టాలిన్..
ఏఐడీఎంకేను వీడని బీజేపీ
చెన్నై, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): తెలంగాణ సీఎం కేసీఆర్ తమిళనాడు పర్యటన మళ్లీ కొత్త పొత్తులపై చర్చకు దారి తీసింది. మూడేళ్ల క్రితం చెన్నై వచ్చిన కేసీఆర్ ‘ఫెడరల్ ఫ్రంట్’ ఏర్పాటుపై నాడు ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే నేత స్టాలిన్‌తో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఇద్దరు నేతలు మళ్లీ కొత్త కూటమి కోసం చర్చించారంటూ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ ఊహాగానాలను డీఎంకే వర్గాలు కొట్టి పారేస్తున్నాయి. కొత్త పొత్తులపై స్టాలిన్‌కు ఆసక్తి లేదంటున్నాయి.
సోనియా, రాహుల్‌తో స్టాలిన్‌కు స్నేహం
కేంద్రంలో అధికారం చలాయిస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు డీఎంకే సిద్ధంగానే వుంది. కానీ కాంగ్రెస్ లేకుండా ఇతర పక్షాలను నమ్ముకుని పరుగులు పెట్టేందుకు సుముఖంగా లేదు. 2003లో వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయేలో ఉన్న డీఎంకే.. తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏతో జత కట్టింది. అప్పటి నుంచి ఆ రెండు పార్టీల మధ్య సఖ్యత కొనసాగుతూనే ఉంది. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో డీఎంకే అధినేత కరుణానిధి కుమార్తె కనిమొళి, ఆ పార్టీ సీనియర్ మంత్రి ఎ.రాజా జైలు పాలైనా యూపీఏను వీడలేదు. కాంగ్రె్‌సపై కరుణానిధి మండిపడినా.. స్టాలిన్ మాత్రం సానుకూలంగానే ఉన్నారు. 2014 పార్లమెంటు ఎన్నికల సమయంలో రెండు పార్టీల నేతల మధ్య విభేదాలు నెలకొన్నా కాంగ్రె్‌సను స్టాలిన్ దూరం చేసుకోలేదు. జయలలిత మరణానంతరం అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన కరుణానిధిని చూసేందుకు ప్రధాని మోదీ హఠాత్తుగా చెన్నై వచ్చారు. ఆ సమయంలో డీఎంకేను దగ్గరయ్యేందుకు బీజేపీ నేతలు గట్టిగానే ప్రయత్నించారు. ఇందుకు స్టాలిన్ సున్నితంగా తిరస్కరించినట్లు డీఎంకే వర్గాలు గుర్తు చేస్తున్నాయి. కాంగ్రెస్ లేకుండా జాతీయ స్థాయిలో ఏర్పాటయ్యే కూటమిలో చేరితే రాష్ట్రంలో తమ పార్టీ నష్టపోవాల్సి వస్తుందనేది స్టాలిన్ భావన. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే చలవతో బీజేపీ తమిళనాట ఊపిరి పోసుకుంది. ఇక మీదట నిర్లక్ష్యం వహిస్తే ఆ పార్టీ బలోపేతమవుతుందని స్టాలిన్ భావిస్తున్నారు. కాంగ్రె్‌సను వదులుకుంటే కమల్ నేతృత్వంలోని మక్కల్ నీదిమయ్యం, దినకరన్ నేతృత్వంలోని ఏఎంఎంకే తదితర చిన్నాచితకా పార్టీలతో జతకడుతుంది. దీనివల్ల ఆ కూటమికి ఒనగూరేదేమీ లేకపోయినా.. అన్నాడీఎంకే-బీజేపీ కూటమి వ్యతిరేక ఓట్లు చీలుతాయి. అలాంటి పొరపాటుకు తావివ్వరాదని స్టాలిన్ యోచిస్తున్నట్లు డీఎంకే వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
కాంగ్రెస్ ‘ఒకటి పక్కన సున్నా’
తమిళనాట కాంగ్రెస్ సున్నానే. కానీ అది ఒకటి పక్కన వుంటే పదవుతుందన్న విషయం స్టాలిన్‌కు బాగా తెలుసు. తమిళనాట అధికారం సాధించే స్థితిలో కాంగ్రెస్ లేనప్పటికీ, కుగ్రామాల్లో సైతం ఆ పార్టీకి చెప్పుకోదగిన కేడర్ ఉంది. అందుకే కాంగ్రె్‌సతో పొత్తు పెట్టుకునే పార్టీ లాభపడుతుంది.
కేసీఆర్‌ను నమ్మే స్థితిలో లేరు!
వ్యక్తిగతంగా కేసీఆర్‌ను అభిమానిస్తున్న స్టాలిన్‌కు ఆయన్ని నమ్మి తృతీయ కూటమి వైపు మళ్లే ఆలోచన లేదని డీఎంకే వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. గతంలో కేసీఆర్.. బీజేపీకి లాభం చేకూర్చేలా వ్యవహరించడం, కేంద్రం ప్రవేశ పెట్టిన సాగు చట్టాలకు కేసీఆర్ మద్దతు పలకడం పట్ల స్టాలిన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారని ఆ వర్గాలు గుర్తు చేశాయి. ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న కేసీఆర్.. 4 రోజులు పోయాక మళ్లీ మనసు మార్చుకుంటే పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నాయి.