200 సీట్లు గెలుచుకుంటాం: నడ్డా

ABN , First Publish Date - 2021-02-07T01:50:30+05:30 IST

పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో బీజేపీ 200కు పైగా సీట్లు గెలుచుకుంటుందని ఆ పార్టీ జాతీయ..

200 సీట్లు గెలుచుకుంటాం: నడ్డా

మాల్డా: పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో బీజేపీ 200కు పైగా సీట్లు గెలుచుకుంటుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని సాగనంపాలని ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. బెంగాల్‌లోని మాల్డాలో శనివారంనాడు జరిగిన రోడ్‌షోలో నడ్డా పాల్గొన్నారు. నడియా జిల్లాలోని నబద్‌విప్ నుంచి 'పరివర్తన్ యాత్ర'కు జెండా ఊపి శ్రీకారం చుట్టారు.


ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ, బెంగాల్ బాగా వెనుకబడటానికి రాష్ట్రంలోని టీఎంసీ నాయకత్వమే కారణమని విమర్శించారు. ముఖ్యమంత్రి మహిళ అయినప్పటికీ 'మహిళల అక్రమ రవాణా' బెంగాల్‌‌లోనే ఎక్కువగా చోటుచేసుకుందని అన్నారు. మమతా సర్కార్ అధికార యంత్రాంగాన్ని రాజకీయమయం చేసి, పోలీసుల్లో నేరచర్యలను ప్రోత్సహించారని విమర్శించారు. అవినీతి వ్యవస్థాగతమైందని అన్నారు. నియంతృత్వం, టూటీలు, బుజ్జగింపు రాజకీయాల స్థాయికి టీఎంసీ దిగజారిపోయిందని, ప్రజావిశ్వాసానికి తూట్లు పొడిచిందని విమర్శించారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారంనాడు బెంగాల్‌లో పర్యటించనున్నారు.

Updated Date - 2021-02-07T01:50:30+05:30 IST