కాంగ్రెస్‌కు నిక్‌నేమ్ పెట్టిన బీజేపీ

ABN , First Publish Date - 2021-11-09T20:34:48+05:30 IST

కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఓ నిక్‌నేమ్ పెట్టింది. ఇండియన్

కాంగ్రెస్‌కు నిక్‌నేమ్ పెట్టిన బీజేపీ

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఓ నిక్‌నేమ్ పెట్టింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్‌సీ) అంటే ‘ఐ నీడ్ కమిషన్’ అని ఎద్దేవా చేసింది. 2007-2012 మధ్య కాలంలో యూపీయే హయాంలో రఫేల్ ఒప్పందం కుదరడం కోసం డసాల్ట్ ఏవియేషన్ కమిషన్లు చెల్లించినట్లు ఫ్రెంచ్ మీడియాలో వార్తలు రావడంతో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఘాటుగా స్పందించారు. 


రఫేల్ ఒప్పందంపై ఫ్రెంచ్ మీడియా కథనాల నేపథ్యంలో సంబిత్ పాత్రా బీజేపీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. 2019 సాధారణ ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలు, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, రఫేల్ ఒప్పందం గురించి తప్పుడు వాతావరణం సృష్టించడానికి చేసిన ప్రయత్నాలను మనమంతా గమనించామని చెప్పారు. అటువంటి వాతావరణం వల్ల రాజకీయంగా ప్రయోజనం పొందవచ్చునని ఆ పార్టీలు భావించాయన్నారు. నేడు తాను చాలా ముఖ్యమైన పత్రాలను ప్రజల ముందు ఉంచుతున్నానని చెప్పారు. అవినీతి ఏ ప్రభుత్వ హయాంలో జరిగిందో ఈ పత్రాలు వెల్లడిస్తాయన్నారు. రఫేల్ ఒప్పందంలో అవినీతి జరిగిందని ఫ్రెంచ్ మీడియా వెల్లడించిందన్నారు. ఈ వ్యవహారమంతా 2007-2012 మధ్య కాలంలో జరిగిందని చెప్పారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌ (ఐఎన్‌సీ)ని ‘ఐ నీడ్ కమిషన్’గా మార్చాలని తాను అభిప్రాయపడుతున్నానని తెలిపారు. 


2019 సాధారణ ఎన్నికలకు ముందు కాంగ్రెస్, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ నిరాధారమైన పుకార్లను ప్రచారం చేశారన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అనేక పత్రికా సమావేశాలను నిర్వహించిందని గుర్తు చేశారు. ఫ్రాన్స్ మీడియాలో ప్రచురితమైన ఓ కథనంలో డసాల్ట్ ఏవియేషన్ చెల్లించిన 7.5 మిలియన్ యూరోలు (దాదాపు రూ.65 కోట్లు) కమిషన్ గురించి పేర్కొన్నారని తెలిపారు. ఎస్ఎం గుప్తాకు గరిష్ఠంగా 11 మిలియన్ యూరోలు కమిషన్‌గా చెల్లించినట్లు ఈ కథనం పేర్కొన్నట్లు తెలిపారు. అగస్టా వెస్ట్‌ల్యాండ్ కేసులో కూడా గుప్తా పేరు వెలుగులోకి వచ్చిందన్నారు. ఇది కేవలం ఓ యాధృచ్ఛిక సంఘటన కాదని, కుట్ర దాగుందని అన్నారు. దీనిపై దర్యాప్తు జరగాలన్నారు. 


రాహుల్ గాంధీ ప్రస్తుతం ఇటలీలో ఉన్నట్లుందని, యూపీయే ప్రభుత్వ హయాంలో ఈ అవినీతి ఎలా జరిగిందో ఆయన ఆ దేశం నుంచి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భారత వాయు సేనకు యుద్ధ విమానాల అవసరం ఉండగా, ఈ ఒప్పందాన్ని పదేళ్ళపాటు పెండింగ్‌లో పెట్టారని దుయ్యబట్టారు. 


Updated Date - 2021-11-09T20:34:48+05:30 IST