14న చెన్నైకి జేపీ నడ్డా

ABN , First Publish Date - 2021-01-12T13:36:18+05:30 IST

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెల 14వ తేదీన చెన్నై రానున్నారు. ‘తుగ్లక్‌’ పత్రిక వార్షికోత్సవంలో పాల్గొనేందుకు వస్తున్న ఆయన బీజేపీ రాష్ట్ర శాఖ నిర్వహిస్తున్న ‘నమ్మ ఊరు పొంగల్‌’ వేడుకల్లోనూ ...

14న చెన్నైకి జేపీ నడ్డా

సీఎం అభ్యర్థిత్వంపై వెనక్కి తగ్గిన బీజేపీ

చెన్నై: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెల 14వ తేదీన చెన్నై రానున్నారు. ‘తుగ్లక్‌’ పత్రిక వార్షికోత్సవంలో పాల్గొనేందుకు వస్తున్న ఆయన బీజేపీ రాష్ట్ర శాఖ నిర్వహిస్తున్న ‘నమ్మ ఊరు పొంగల్‌’ వేడుకల్లోనూ పాల్గొననున్నారు. స్థానిక  మధురవాయల్‌లో జరుగనున్న వేడుకలకూ హాజరుకానున్నారు. దానికంటే ముందుగా ఆయన బీజేపీ రాష్ట్ర నేతలతో భేటీ కానున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పార్టీ నడచుకోవాల్సిన తీరుపై దిశానిర్దేశం చేయనున్నారు. ఆ తరువాత పొంగల్‌ వేడుకలు, అనంతరం తుగ్లక్‌ పత్రిక వార్షికోత్సవంలో పాల్గొననున్నారు. చాలాకాలం తరువాత నడ్డా రాష్ట్రానికి వస్తుండడంతో బీజేపీ నేతలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా వస్తున్నందున నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం పెంపొందించేలా ఏర్పాట్లు చేపట్టనున్నారు. అన్నాడీఎంకే-బీజేపీ కూటమిలో గత కొంతకాలంగా పొరపొచ్చాలు చోటుచేసుకున్నట్టు భావించారు. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ఈ రెండు పార్టీల నడుమ విభేదాలు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎడప్పాడిని అన్నాడీఎంకే ప్రకటించింది. అయితే అన్నాడీఎంకే చేసిన ప్రకటన సరికాదని, ఎవరు సీఎం అభ్యర్థి అన్నది తమ జాతీయ నేతలు నిర్ణయించి ఢిల్లీలో ప్రకటిస్తారంటూ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు రెండు పార్టీల నడుమ సంబంధాలను దెబ్బతీసినట్టుగా కనిపించింది. ఈ వ్యవహారంపై పరస్పర విమర్శలు రేగుతుండగానే అన్నాడీఎంకే సర్వసభ్య మండలి కూడా తమ పాత నిర్ణయానికే కట్టుబడుతూ తీర్మానం చేసింది.  కూటమిలో నెలకొన్న స్తంభనను నడ్డా తేల్చేస్తారని అన్నాడీఎంకే మిత్రపక్షాలన్నీ వ్యాఖ్యానించాయి. ఈ నేపథ్యంలో నడ్డా చెన్నై రాకకు రెండ్రోజులు ముందుగానే బీజేపీ రాష్ట్ర శాఖ సామరస్య ధోరణిని అవలంబించింది.


వెనక్కి తగ్గిన బీజేపీ

రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది తమ పార్టీ అధిష్ఠానమే నిర్ణయిస్తుందంటూ ఇన్నాళ్లూ చెబుతూ వచ్చిన బీజేపీ.. ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. ముఖ్యమంత్రిగా ఎడప్పాడి పళనిస్వామి పేరు ఖరారు చేస్తూ అన్నాడీఎంకే ప్రకటించడంపై తమకెలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. తమినాడులో అన్నాడీఎంకే పెద్ద పార్టీ అయినందున సీఎం అభ్యర్థిత్వం నిర్ణయం తీసుకునే అధికారం ఉందని, ఇక్కడ తమది చిన్న పార్టీ అయినందున ఆ నిర్ణయాన్ని గౌరవించాల్సిందేనని ఆ పార్టీ తమిళనాడు ఇన్‌చార్జి సీటీ రవి మీడియాకు స్పష్టం చేశారు. అందువల్ల ఈ సమస్య ఇంతటితో సమసిపోయినట్టేనని ఇరువర్గాలు భావిస్తున్నాయి. 

Updated Date - 2021-01-12T13:36:18+05:30 IST