ఉగ్రవాదుల నుంచి గౌతమ్ గంభీర్‌కు మరోమారు బెదిరింపులు

ABN , First Publish Date - 2021-11-29T02:06:27+05:30 IST

టీమిండియా మాజీ క్రికెటర్, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ గౌతమ్ గంభీర్‌కు ఉగ్రవాదుల

ఉగ్రవాదుల నుంచి గౌతమ్ గంభీర్‌కు మరోమారు బెదిరింపులు

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ గౌతమ్ గంభీర్‌కు ఉగ్రవాదుల నుంచి మరోమారు బెదిరింపులు వచ్చాయి. ఐసిస్ కశ్మీర్ పేరుతో ఇప్పటికే రెండుసార్లు బెదిరింపు ఈమెయిల్స్ రాగా, తాజాగా మరోమారు అలాంటి ఈమెయిలే వచ్చింది.


ఢిల్లీ పోలీసులు, ఐపీఎస్ అధికారి శ్వేతా చౌహాన్ (డీసీపీ) తమను ఏమీ చేయలేరని, పోలీసుల్లోనూ తమ గూఢచారులు ఉన్నారని తాజా ఈమెయిల్‌లో ఉగ్రవాదులు హెచ్చరించారు. మూడో ఈమెయిల్ విషయాన్ని గంభీర్ మరోమారు పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. గత ఆరు రోజుల్లో ఇది మూడో ఈమెయిల్ కావడం గమనార్హం. 


గంభీర్, ఆయన కుటుంబాన్ని చంపేస్తామంటూ గత మంగళవారం తొలిసారి గంభీర్‌కు ఈమెయిల్ వచ్చింది. గంభీర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎంపీ ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే, ఆ తర్వాతి రోజు గంభీర్ ఇంటి వీడియోను జత చేస్తూ ఉగ్రవాదులు మరో ఈమెయిల్ పంపారు.


తాజాగా, మరో ఈమెయిల్ రావడం ఆందోళన కలిగిస్తోంది. వీటి మూలాలు పాకిస్థాన్‌లోనే ఉన్నట్టు గుర్తించిన పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. మెయిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకునేందుకు కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటికే గూగుల్‌ను సంప్రదించింది. గూగుల్ ఇచ్చిన సమాచారాన్ని బట్టి పాకిస్థాన్ నుంచి ఓ విద్యార్థి ఈ మెయిల్స్‌ను పంపిస్తున్నట్టు తేలింది. 

Updated Date - 2021-11-29T02:06:27+05:30 IST