ఓబీసీ రిజర్వేషన్లపై తప్పుదారి పట్టిస్తున్న బీజేపీ: నవాబ్ మాలిక్

ABN , First Publish Date - 2021-08-06T20:38:40+05:30 IST

మహారాష్ట్రలో ఓబీసీ రిజర్వేషన్లపై బీజేపీ తప్పుదారి పట్టిస్తోందని ఎన్‌సీపీ నేత..

ఓబీసీ రిజర్వేషన్లపై తప్పుదారి పట్టిస్తున్న బీజేపీ: నవాబ్ మాలిక్

ముంబై: మహారాష్ట్రలో ఓబీసీ రిజర్వేషన్లపై బీజేపీ తప్పుదారి పట్టిస్తోందని ఎన్‌సీపీ నేత, ఆ రాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఆరోపించారు. రాజ్యాంగం ప్రకారం ఓబీసీ రిజర్వేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతిస్తోందని, ఈ ప్రక్రియను వేగిరపరచాలని బీజేపీ కోరుకుంటే సంబంధిత గణాంకాలకు తమకు అందించాల్సి ఉంటుందని అన్నారు.


''ఓబీసీ రిజర్వేషన్ల అంశం పరిష్కారం కాకుండా మహారాష్ట్రలో ఎన్నికలు ఉండవని బీజేపీ చెబుతోంది. మాకు సంతోషమే. అయితే ఎన్నికలు సకాలంలో నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ కట్టుబడి ఉండాలి. బీజేపీకి నిజంగానే ఈ విషయంపై చిత్తశుద్ధి ఉంటే, అంతా కలిసి కూర్చుకుని దానికొక పరిష్కారం కొనుగొనాల్సి ఉంటుంది'' అని శుక్రవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆయన అన్నారు.


బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే సమావేశం కానుండటంపై అడిగిన ప్రశ్నకు నవాబ్ మాలిక్ సమాధానమిస్తూ, వివిధ పార్టీల నేతలు సమావేశమయ్యే హక్కు వారికి ఉంటుందని, భవిష్యత్తులో ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటాయా అనేది చూడాల్సి ఉందని అన్నారు. వ్యాక్సిన్ వేయించుకున్న ప్రయాణికుల కోసం సబర్బన్ సర్వీసులు పునరుద్ధరించాలని బీజేపీ చేస్తున్న డిమాండ్‌పై కూడా ఆయన స్పందించారు. ప్రస్తుతానికి నిత్యావసర సర్వీసుల అందించే వారిని మాత్రమే రైళ్లలో అనుమతిస్తున్నామని, రాష్ట్రంలోని 25 జిల్లాల్లో చాలామటుకు ఆంక్షలు సడలించామని చెప్పారు. సామాన్య ప్రజానీకాన్ని కూడా రైళ్లలో అనుమతించే విషయమై ముఖ్యమంత్రి సకాలంలో నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. పెగాసస్ వివాదంపై సరైన విచారణకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మరో ప్రశ్నకు సమాధానంగా నవాబ్ మాలిక్ చెప్పారు.

Updated Date - 2021-08-06T20:38:40+05:30 IST