గవర్నర్ కోషియారీతో భేటీ అయిన బీజేపీ బృందం

ABN , First Publish Date - 2021-03-24T17:02:22+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణ్‌వీస్ నేతృత్వంలో బీజేపీ బృందం బుధవారం గవర్నర్ కోషియారీతో భేటీ అయ్యింది. ముంబై మాజీ పోలీస్

గవర్నర్ కోషియారీతో భేటీ అయిన బీజేపీ బృందం

ముంబై : మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణ్‌వీస్ నేతృత్వంలో బీజేపీ బృందం బుధవారం గవర్నర్ కోషియారీతో భేటీ అయ్యింది. ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై చేసిన సంచలన ఆరోపణల నేపథ్యంలో బీజేపీ బృందం గవర్నర్‌తో భేటీ అయ్యింది. బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్, సుధీర్ మునగంటివార్ తదితరులు ఈ బృందంలో ఉన్నారు. గవర్నర్‌తో భేటీ అయిన తర్వాత మాజీ సీఎం ఫడ్నవీస్ విలేకరులతో మాట్లాడారు. అనిల్ దేశ్‌ముఖ్ వ్యవహారంలో సీఎం ఉద్ధవ్ ఎందుకు మౌనం వహిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక్క మాట కూడా మాట్లాడం లేదని, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మాత్రం ఈ విషయంపై రెండు మార్లు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారని ఎద్దేవా చేశారు.


అంతేకాకుండా హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ను వెనకేసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. హోంమంత్రిపై అవినీతి ఆరోపణలు వచ్చినా, ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఉద్ధవ్ సర్కార్ నైతిక విలువలకు తిలోదకాలిచ్చిందని మండిపడ్డారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ‘మహావికాస్ అగాఢీ ప్రభుత్వం’ కాదని, ‘మహా వసూల్ అగాఢీ ప్రభుత్వం’ అని ఫడ్నవీస్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ కూడా ఈ విషయంపై మౌనంగా ఉందని, ఇందులో కాంగ్రెస్ వాటా ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ రోజు తమ బృందం గవర్నర్ కోషియారీతో భేటీ అయ్యామని, మొత్తం విషయాన్ని గవర్నర్‌కు నివేదించామని ఫడ్నవీస్ వెల్లడించారు. ఈ విషయంపై సీఎం మౌనంగా ఉండిపోయారు కాబట్టి, గవర్నర్ ఈ వ్యవహారంపై దృష్టి సారించాలని తెలిపారు. అధికారిక సమాచారం లీక్ అయిన విషయంపై అధికారులు తనపై కేసులు పెట్టినా, భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఎంతకైనా వెళ్తామని ఫడ్నవీస్ అన్నారు. 


Updated Date - 2021-03-24T17:02:22+05:30 IST