రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర : అఖిలేశ్ యాదవ్

ABN , First Publish Date - 2021-12-31T17:29:10+05:30 IST

వెనుకబడిన, షెడ్యూల్డు కులాలు, తెగలకు ప్రభుత్వోద్యోగాల్లో

రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర : అఖిలేశ్ యాదవ్

లక్నో : వెనుకబడిన, షెడ్యూల్డు కులాలు, తెగలకు ప్రభుత్వోద్యోగాల్లో రిజర్వేషన్లను రద్దు చేయాలని బీజేపీ కుట్ర పన్నుతోందని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. ప్రభుత్వోద్యోగాల కోసం ఆశపడుతున్న యువతకు ఇది శరాఘాతమని చెప్పారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి త్వరలో జరిగే ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికలు గొప్ప అవకాశమని తెలిపారు. 


అఖిలేశ్ యాదవ్ గురువారం రాత్రి ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ, బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రైవేటీకరణ బాట పడుతూ, ప్రభుత్వోద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లను రద్దు చేయాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. భారత రాజ్యాంగాన్ని, దాని ద్వారా లభిస్తున్న హక్కులను కాపాడుకోవడానికి 2022 ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికలు చరిత్రాత్మక అవకాశమని తెలిపారు. నిరుద్యోగులు, అణగారిన వర్గాలవారు రాజ్యాంగాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. 


ఈ ఎన్నికల్లో పరాజయం తప్పదనే భయం బీజేపీని వెంటాడుతోందన్నారు. ఓటమి ఎదురుకాబోతున్నందువల్ల ఆ పార్టీ మరింత అసహనంతో వ్యవహరిస్తోందన్నారు. కుట్రలు పన్నేందుకు ప్రయత్నిస్తోందని, ప్రతిపక్షాలను అప్రతిష్ఠపాలు చేసే ప్రయత్నాలు పెరుగుతున్నాయని చెప్పారు. అయితే ప్రజలు ఈ తప్పులన్నిటినీ గుర్తిస్తున్నారని, ప్రతిపక్షాలకు పెద్ద సంఖ్యలో మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. 


యువతకు ఉద్యోగాలు ఇచ్చామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్తున్నారని, అయితే ఉద్యోగాలు ఇవ్వాలని కోరినవారిని, టీచర్స్ రిక్రూట్‌మెంట్‌లో అక్రమాలపై నిరసన తెలిపిన వారిని కొట్టిన విషయాన్ని దాటవేస్తున్నారని ఆరోపించారు. 2018 తర్వాత ప్రకటించిన దాదాపు 1,30,000కు పైగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో దళితులు, వెనుకబడిన వర్గాలవారు తమ రిజర్వేషన్ హక్కులను కోల్పోయారని ఆరోపించారు. ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఎవరికి ఇచ్చిందో తెలియజేస్తూ హోర్డింగ్‌లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 


Updated Date - 2021-12-31T17:29:10+05:30 IST