బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్: భారీగా పడిపోయిన చికెన్, గుడ్ల ధరలు

ABN , First Publish Date - 2021-01-12T14:27:48+05:30 IST

పౌల్ట్రీ మార్కెట్‌ను బర్డ్ ఫ్లూ పూర్తిగా దెబ్బతీసింది. నిజానికి శీతాకాలంలో...

బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్:  భారీగా పడిపోయిన చికెన్, గుడ్ల ధరలు

న్యూఢిల్లీ: పౌల్ట్రీ మార్కెట్‌ను బర్డ్ ఫ్లూ పూర్తిగా దెబ్బతీసింది. నిజానికి శీతాకాలంలో చికెన్, గుడ్లు అధికసంఖ్యలో విక్రయమవుతుంటాయి. అయితే ఈసారి బర్డ్ ఫ్లూ కోళ్ల వ్యాపారాన్ని నీరుగార్చింది. దేశంలోని 10 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందిందని స్పష్టమైన నేపధ్యంలో చికెన్, గుడ్ల ధరలు అమాంతం పడిపోయాయి. కొన్ని రాష్ట్రాల్లో కిలో చికెన్ ధర రూ. 60 రూపాయలకు దిగువగా పడిపోయింది. కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హరియాణా, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఢిల్లీ రాష్ట్రాలలో బర్డ్ ఫ్లూ వ్యాపించినట్లు ప్రభుత్వం తెలిపింది. 


మరోవైపు గతకొంతకాలంగా వివిధ రాష్ట్రాలలో పక్షులు మృతి చెందుతున్న ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో ఆయా ప్రాంతాల్లోని జనం చికెన్, గుడ్లు తినాలంటే భయపడుతూ వాటికి దూరంగా ఉంటున్నారు. మహారాష్ట్రలో కిలో చికెన్ ధర రూ. 82 నుంచి రూ. 58కి చేరుకోగా, గుజరాత్‌లో రూ. 94 నుంచి రూ. 65కు చేరుకుంది. తమిళనాడుతో రూ. 80 నుంచి రూ. 70కి చేరుకుంది. ఇదేవిధంగా గుడ్ల ధరలు కూడా తగ్గాయి. తమిళనాడులోని నమక్కల్‌లో ఒక గుడ్డు ధర రూ.5.10 నుంచి 4.20కి దిగజారింది. హరియాణాలోని బర్వాలాలో ఒక గుడ్డు ధర రూ. 5.35నుంచి రూ. 4.05 పైసలకు చేరుకుంది. పూణెలో ఒక గుడ్డు ధర రూ. 4.50 పైసలుగా ఉంది.

Updated Date - 2021-01-12T14:27:48+05:30 IST