చలిగుప్పిట్లో భారతం

ABN , First Publish Date - 2021-12-19T07:46:32+05:30 IST

ఉత్తరభారతదేశాన్ని చలి వణికిస్తోంది. శనివారం పలుప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోయాయి. ...

చలిగుప్పిట్లో భారతం

గణనీయంగా పడిపోయిన పగటి ఉష్ణోగ్రతలు

మరో మూడు రోజులు ఇదే పరిస్థితి!

ఢిల్లీలో కనీస ఉష్ణోగ్రత 6 డిగ్రీలు

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో 7.1 డిగ్రీలు?


న్యూఢిల్లీ, డిసెంబరు 18 : ఉత్తరభారతదేశాన్ని చలి వణికిస్తోంది. శనివారం పలుప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోయాయి. ఢిల్లీలో కనీస ఉష్ణోగ్రత శనివారం 6 డిగ్రీలుగా నమోదైంది.  ఈ సీజన్‌లో ఇంతతక్కువ ఉష్ణోగ్రత నమోదుకావడం ఇదే తొలిసారి అని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. వాయువ్య భారతదేశంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా తక్కువగా నమోదుకానున్నట్టు తెలిపారు. ఉత్తరభారతదేశంలోని చాలా ప్రాంతాల్లో మరో మూడురోజులపాటు (మంగళవారం వరకు) ఇలాంటి పరిస్థితులే కొనసాగుతాయని వాతావరణశాఖ  శనివారం పేర్కొంది. ఈనేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. కాగా, రాజస్థాన్‌ సికర్‌ జిల్లా ఫతేపూర్‌లో కనీస ఉష్ణోగ్రత మైనస్‌ 3.3 డిగ్రీ సెల్సియ్‌సకు పడిపోయింది. ఉత్తరాఖండ్‌లోనూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఈనెల 21 వరకు చలిగాలులు వీయనున్నట్టు వాతావరణశాఖ అధికారులు చెప్పారు. శ్రీనగర్‌ సహా జమ్మూకశ్మీర్‌లోని చాలా ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు మైనస్‌ జీరోకి చేరుకున్నాయి. శ్రీఽనగర్‌లో శుక్రవారం రాత్రి ఈ సీజన్‌లో అతి తక్కువగా మైనస్‌-6 డిగ్రీల సెల్సియ్‌సగా నమోదైంది. ప్రముఖ టూరిస్టు ప్రాంతమైన గుల్మర్గ్‌లో మైనస్‌ 8.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కశ్మీర్‌ లోయలో చలిగాలుల తీవ్రత కారణంగా చాలాప్రాంతాల్లో  నీటిని సప్లయ్‌ చేసే లైన్లు గడ్డకట్టుకుపోయాయి. పంజాబ్‌, హర్యానా, చండీగఢ్‌, సౌరాష్ట్రా, కచ్‌లోనూ మంగళవారం వరకు సాధారణం నుంచి అతి తీవ్ర గాలులు వీయనున్నట్టు వాతావరణశాఖ తెలిపింది. 


బీదర్‌ను వణికిస్తున్న చలి

కర్ణాటక రాష్ట్రం బీదర్‌ను చలి గజగజలాడిస్తోంది. శుక్రవారం బీదర్‌లో ఉష్ణోగ్రత 10 డిగ్రీల కనిష్ట స్థాయికి పడిపోయింది. దీంతో జిల్లావ్యాప్తంగా ప్రజలు వణికిపోయారు. సాధారణంగా జనవరి మొదటి వారంలో జిల్లాలో తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యేది. అయితే 20 రోజుల ముందే ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 9 గంటలదాకా ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోతోంది. చలి నుంచి కాపాడుకునేందుకు మంటలు వేసుకుంటున్నారు. కాగా ఉత్తర కర్ణాటక ప్రాంతంలోనూ నాలుగైదు రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. 

Updated Date - 2021-12-19T07:46:32+05:30 IST