మహిళపై అఘాయిత్వం అబద్ధం: బీర్భూమ్ జిల్లా ఎస్పీ

ABN , First Publish Date - 2021-05-06T00:31:10+05:30 IST

పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం చెలరేగిన హింసపై ఓవైపు...

మహిళపై అఘాయిత్వం అబద్ధం: బీర్భూమ్ జిల్లా ఎస్పీ

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం చెలరేగిన హింసపై ఓవైపు వార్తలు వస్తుండగా, అలాంటి సంఘటనలేమీ జరగలేదని పోలీసులు ధ్రువీకరించారు. బీర్భూమ్‌లో మహిళపై సామూహిక అత్యాచారం వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని, అవన్నీ అసత్య ప్రచారాలేనని ఎన్నికల కమిషన్ నియమించిన బీర్భూమ్ జిల్లా ఎస్‌పీ నరేంద్ర నాథ్ త్రిపాఠి బుధవారంనాడు మీడియాకు తెలిపారు.


బెంగాల్ బీజేపీ, ఆ పార్టీ రాష్ట్ర నేతలు మంగళవారంనాడు వరుస ట్వీట్లలో బీర్బూమ్‌లోని నరూర్‌లో ఒక బీజేపీ కార్యకర్తపై సామూహిక అత్యాచారం జరిగినట్టు సమాచారం వచ్చిందని ఆరోపించారు. ఎంపీ, రాష్ట్ర యువ మోర్చా అధ్యక్షుడు సౌమిత్రా ఖాన్ నేరుగా ఒక మహిళ ఫేస్‌ను బ్లర్ చేసిన ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ననూర్‌లోని బీజేపీ కార్యకర్తలే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇది వైరల్ కావడంతో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. దర్యాప్తులో వెల్లడైన వివరాలను బీర్భూమ్ ఎస్‌పీ త్రిపాఠి పంచుకుంటూ, మహిళపై అత్యాచారం వార్తల్లో నిజం లేదన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన ఈ ఫేక్ న్యూస్ ఎక్కడిదో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. తప్పుడు వార్తలు పుట్టించిన వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. బీర్భూమ్‌లో ఎలాంటి శాంతి భద్రతల సమస్య లేదని చెప్పారు.


బీర్భూమ్ జిల్లా అధ్యక్షుడి వివరణ

కాగా, బాధితురాలిగా చెబుతున్నమహిళే తనపై వచ్చిన వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని ధ్రువీకరించినట్టు బీర్భూమ్ జిల్లా అధ్యక్షుడు అనుబ్రత మాండల్ తెలిపారు. కొందరు టీఎంసీ కార్యకర్తలు తనను  బెదరించారని, దాంతో భయంతో వేరే గ్రామానికి వెళ్లాలని మాత్రమే ఆమె పేర్కొన్నట్టు మీడియాకు మాండల్ చెప్పారు. 


Updated Date - 2021-05-06T00:31:10+05:30 IST