వాలీబాల్ ఆడినందుకు తల నరికారు
ABN , First Publish Date - 2021-10-21T08:07:21+05:30 IST
: మతఛాందసులు రాజ్యమేలతారని తెలియక.. ఆటలాడడమే ఆ అమ్మాయి చేసిన నేరం. ఆ నేరానికి ఆమె..
క్రీడాకారిణి ప్రాణాలు బలిగొన్న తాలిబాన్లు
కాబూల్, అక్టోబరు 20: మతఛాందసులు రాజ్యమేలతారని తెలియక.. ఆటలాడడమే ఆ అమ్మాయి చేసిన నేరం. ఆ నేరానికి ఆమె ప్రాణాలనే మూల్యంగా చెల్లించాల్సి వచ్చింది. అఫ్ఘానిస్థాన్‌ను చెరబట్టిన తాలిబాన్ మూకల చేతిలో దారుణంగా ప్రాణాలు కోల్పోయిన మహజబీన్ హకిమి విషాదగాథ ఇది. కాబూల్ మునిసిపాలిటీ వాలీబాల్ క్లబ్‌కు ఆడి.. ఆ తర్వాత అఫ్ఘాన్ జూనియర్ వుమెన్స్ నేషనల్ వాలీబాల్ టీమ్‌కు ఎంపికై సత్తా చాటిన హకిమిని తాలిబాన్లు ఈ నెల మొదట్లో తల నరికి చంపేశారు. ఈ విషయాన్ని ఆమె కోచ్ బ్రిటిష్ మీడియాకు తెలిపారు. అయితే, ఈ విషయం ఇప్పటిదాకా బయటి ప్రపంచానికి తెలియదని.. చెప్తే చంపేస్తామని తాలిబాన్లు ఆమె కుటుంబసభ్యులను బెదిరించారని కోచ్ వెల్లడించారు.
అయితే.. తాలిబాన్లు తెగనరికిన మహజబీన్ తల అంటూ కొన్ని చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కోచ్ ఈ విషయాన్ని ప్రపంచానికి తెలిపారు. మహిళా అథ్లెట్లు భయంతో అనామకంగా రహస్యప్రదేశాల్లో తలదాచుకుంటున్నారని తెలిపారు. ఇక.. అఫ్ఘాన్ గత ప్రభుత్వంతో యుద్ధంలో మరణించిన ఆత్మాహుతి దళాల సభ్యులను తాలిబాన్ సర్కారు ప్రశంసించింది. వారి కుటుంబాలకు 111 డాలర్ల నగదు, స్థలం ప్రకటించింది. మరోవైపు అఫ్ఘాన్ సంక్షోభంపై రష్యా బుధవారం తాలిబాన్, ఇతర వర్గాలతో చర్చలు జరిపింది. అఫ్ఘాన్ ప్రభుత్వంలో అన్ని జాతులు, రాజకీయ శక్తులకు స్థానం ఉండాలని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ వారికి సూచించారు.