ఖురాన్‌కు అపచారం చేసిన వ్యక్తిని గుర్తించాం : బంగ్లాదేశ్
ABN , First Publish Date - 2021-10-21T15:50:00+05:30 IST
ఖురాన్‌కు అపచారం చేసి, హిందువులపై హింసాత్మక దాడులకు

ఢాకా : ఖురాన్‌కు అపచారం చేసి, హిందువులపై హింసాత్మక దాడులకు కారకుడైన వ్యక్తిని గుర్తించినట్లు బంగ్లాదేశ్ పోలీసులు ప్రకటించారు. కొమిల నగర పోలీస్ సూపరింటెండెంట్ ఫరూఖ్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ, నగరంలోని సుజ నగర్ ప్రాంతంలో నివసిస్తున్న ఇక్బాల్ హుస్సేన్ ఖురాన్‌ను దుర్గా పూజ మండపంలో పెట్టినట్లు చెప్పారు.
ఇక్బాల్ హుస్సేన్ (35) స్థానిక మసీదులోని ఖురాన్‌ను తీసుకుని, నడుచుకుంటూ వెళ్లి దుర్గా పూజ మండపంలో పెట్టినట్లు, ఈ మండపం నుంచి హనుమంతుని విగ్రహాన్ని పట్టుకెళ్ళినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించిందని ఢాకా మీడియా తెలిపింది. దుర్గా పూజ మండపంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించినపుడు ఈ విషయం వెల్లడైందని తెలిపింది. ఇతనిని ఇంకా అరెస్టు చేయలేదని పేర్కొంది.
కొమిల నగర పోలీస్ సూపరింటెండెంట్ ఫరూఖ్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ, నగరంలోని సుజ నగర్ ప్రాంతంలో నివసిస్తున్న ఇక్బాల్ హుస్సేన్ ఖురాన్‌ను దుర్గా పూజ మండపంలో పెట్టినట్లు చెప్పారు. గురువారం మరిన్ని వివరాలను వెల్లడిస్తామని తెలిపారు.
బంగ్లాదేశ్‌లో గత బుధవారం నుంచి దేవాయాలు, హిందువులపై దాడులు తీవ్రంగా జరుగుతున్నాయి. దుర్గా పూజ మండపంలో ఖురాన్ ఉన్నట్లు కనిపిస్తున్న ఓ పోస్ట్ సోషల్ మీడియాలో కనిపించడంతో పెద్ద ఎత్తున హింసాకాండ జరిగింది. గత ఆదివారం ముష్కర మూకలు హిందువులకు చెందిన 66 ఇళ్లను ధ్వంసం చేసి, 20 ఇళ్ళకు నిప్పు పెట్టారు.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో హిందువులపైనా, హిందూ దేవాలయాలపైనా జరిగిన దాడులకు సంబంధించిన కేసుల్లో దాదాపు 450 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కొమిలలో జరిగిన దాడులతో ప్రమేయం ఉందనే అనుమానంతో 41 మందిని అరెస్టు చేశామన్నారు. వీరిలో నలుగురు హుస్సేన్ సహచరులని తెలిపారు.
బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఆ దేశ హోం మంత్రికి గట్టిగా ఆదేశాలు ఇచ్చారు. హిందువులపై హింసను ప్రేరేపించినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. యథార్థాలను తనిఖీ చేసుకోకుండా సోషల్ మీడియాలో వచ్చినవాటిని నమ్మవద్దని ప్రజలను కోరారు.
ముస్లిం మెజారిటీ బంగ్లాదేశ్‌లో హిందువులు సుమారు 10 శాతం మంది ఉన్నారు.