బంగారుపుర కానున్న విజయపుర

ABN , First Publish Date - 2021-12-26T18:20:31+05:30 IST

విజయపుర ఇక బంగారుపుర కానుందని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై తెలిపారు. శనివారం ఆయన జిల్లా పాలనాభవన్‌ నిర్మాణాలకు శంకుస్థాపనతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. రాష్ట్ర

బంగారుపుర కానున్న విజయపుర

            - ఆరు నెలల్లో నిరంతరం తాగునీరు: సీఎం బసవరాజ్‌ బొమ్మై 


బెంగళూరు: విజయపుర ఇక బంగారుపుర కానుందని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై తెలిపారు. శనివారం ఆయన జిల్లా పాలనాభవన్‌ నిర్మాణాలకు శంకుస్థాపనతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. రాష్ట్ర మురికివాడల నిర్మూలనా మండలిచే విజయపుర, నాగవార, ఇండి, సిందగి శాసనసభ నియోజకవర్గాలలోని మురికివాడ వాసులకు హక్కుపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ యత్నాళ్‌ నేతృత్వంలో ధూళాపుర బంగారపుర కానుందని కొనియాడారు. విజయపురలో మరో ఆరు నెలల్లో నిరంతరం తాగునీరు అందుబాటులోకి రానుందన్నారు. తాగునీటికి నిధుల కొరతలేదన్నారు. ఈ పథకం తన తండ్రి ఎస్‌ఆర్‌ బొమ్మై ప్రారంభించారని గుర్తు చేశారు. బాగల్కోటె, విజయపుర జిల్లాల ప్రజలు ఐదు దశాబ్దాలుగా త్యాగాలు చేశారని, కరువు నుంచి అధిగమించేందు కు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ఆల్మట్టి జలాశయం ఎత్తు పెంచేవిషయంలో ముంపు బాధితులకు పునరావాసం ఏర్పాటుకు కట్టుబడతామన్నారు. మంత్రులు గోవింద కారజోళ, సోమణ్ణ పాల్గొన్నారు. కాగా అంతకుముందు మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎం హావేరి జిల్లా రాణిబెన్నూరులో కొవిడ్‌ మృతుల కుటుంబాలకు పరిహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే 14-15 నెలల్లో రాజకీయాలు చేయనన్నారు. ప్రజల అభివృద్ధే లక్ష్యమని ఆ దిశగానే పనిచేస్తానన్నారు. 

Updated Date - 2021-12-26T18:20:31+05:30 IST