ఆర్యన్‌ఖాన్‌కు బెయిల్
ABN , First Publish Date - 2021-10-29T08:18:15+05:30 IST
ముంబై నౌకలో డ్రగ్స్ పార్టీ కేసులో అరెస్టయిన బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌కు ఎట్టకేలకు బెయిల్ లభించింది.
మరో ఇద్దరు నిందితులకు కూడా..
మంజూరు చేసిన బాంబే హైకోర్టు
స్వాగతించిన బాలీవుడ్ ప్రపంచం
గోసావిని అరెస్టు చేసిన పుణె పోలీసులు
తెలంగాణ, యూపీలో తలదాచుకున్నట్లు వెల్లడి
నోటీసివ్వకుండా వాంఖడేను అరెస్టు చేయం
బాంబే హైకోర్టుకు తెలిపిన ముంబై పోలీసులు
ముంబై, అక్టోబరు 28: ముంబై నౌకలో డ్రగ్స్ పార్టీ కేసులో అరెస్టయిన బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఈ నెల 3న అరెస్టయిన ఆర్యన్‌ను.. మాదక ద్రవ్యాల నిరోధక బృందం(ఎన్‌సీబీ) తమ కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత 20 రోజులుగా ఆర్థర్‌రోడ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ట్రయల్ కోర్టులో ఆర్యన్‌కు బెయిల్ లభించకపోవడంతో.. అతని తరఫు న్యాయవాదులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అరెస్టు సమయంలో ఆర్యన్ వద్ద డ్రగ్స్ సీజ్ కాలేదని వాదనలు వినిపించారు. ఆర్యన్‌కు డ్రగ్స్ ముఠాలతో సంబంధాలున్నాయంటూ ఎన్‌సీబీ వాదించింది. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు సుదీర్ఘంగా వాదోపవాదాలు జరిగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న ఆర్యన్‌కు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు న్యాయమూర్తి ఎన్‌డబ్ల్యూ సాంబ్రే వెల్లడించారు. శుక్రవారం వివరణాత్మక ఆర్డర్స్‌ను విడుదల చేస్తామన్నారు. దీంతో శుక్రవారం సాయంత్రానికి ఆర్యన్ విడుదలవుతారని తెలుస్తోంది. ఈ కేసులో ఆర్యన్ సహ నిందితులు అర్బాజ్ మర్చంట్, మున్‌మున్ ధామేచకు కూడా బెయిల్ మంజూరైంది. ఆర్యన్‌కు బెయిల్ మంజూరవ్వడం పట్ల బాలీవుడ్ ప్రపంచం హర్షం వ్యక్తం చేసింది.
షారూఖ్ ఖాన్ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. కాగా, ఈ కేసులో పరారీలో ఉన్న స్వచ్ఛంద సాక్షి కేపీ గోసావిని పుణె పోలీసులు అరెస్టు చేశారు. అతను మహారాష్ట్రతోపాటు.. తెలంగాణ, యూపీల్లో తలదాచుకున్నారని వివరించారు. 2018లో నమోదైన ఓ చీటింగ్ కేసులో అతను నిందితుడని పేర్కొన్నారు. పాల్ఘార్ జిల్లాలోని కేల్యా పోలీ్‌సస్టేషన్‌లో కూడా అతనిపై చీటింగ్ కేసు ఉందని తెలిపారు. అతని అంగ రక్షకుడు ప్రభాకర్ సెయిల్ ఎన్‌సీబీపై చేసిన లంచం ఆరోపణలపై ముంబై పోలీసులు దర్యాప్తు జరుపుతున్న నేపథ్యంలో.. గోసావిని అప్పగిస్తారా? లేదా ఎన్‌సీబీకి అప్పగిస్తారా? అని విలేకరులు ప్రశ్నించగా.. దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని పుణె సీపీ అమితాబ్ గుప్తా అన్నారు. దీన్ని బట్టి.. ఇప్పట్లో గోసావి ఎన్‌సీబీకి వాంగ్మూలం ఇచ్చే అవకాశాలు లేనట్లుగా తెలుస్తోంది. లంచం/బెదిరింపు ఆరోపణలపై ముంబై పోలీసులు తనపై నాలుగు బృందాలతో దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ముంబై పోలీసులు సమర్పించిన అఫిడవిట్‌లో.. ‘‘ముందుగా నోటీసులు జారీ చేయకుండా సమీర్ వాంఖడేను అరెస్టు చేయబోం’’ అని పేర్కొన్నారు.
వాంఖడే ముస్లిమే: ఖురేషి
వాంఖడే ముస్లిమేనని అందుకే అతనికి తన కూతురు డాక్టర్ షబానాను ఇచ్చి 2006లో వివాహం చేశానని సమీర్ వాంఖడే మాజీ మామ డాక్టర్ జాహెద్ ఖురేషి వెల్లడించారు. ‘‘సమీర్ అప్పుడప్పుడూ నమాజ్ కోసం మసీదుకు వెళ్లేవాడు. అతను ఐఆర్‌ఎ్‌సకు ఎంపికైనప్పుడు కోటా గురించి తెలియదు. ఇప్పుడతను హిందువునంటూ క్లెయిమ్ చేసుకుంటుండడంతో మావాళ్లు నన్ను ప్రశ్నిస్తున్నారు’’ అని విలేకరులకు చెప్పారు. వాంఖడే ముస్లిమేనంటూ ముందు నుంచి ఆరోపిస్తున్న మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ గురువారం స్వరాన్ని మరింత పెంచారు. ‘‘ ఫ్యాషన్ టీవీ భారత చీఫ్ కాషీ్‌ఫఖాన్.. సమీర్ వాంఖడే మంచి మిత్రులు. అందుకే.. డ్రగ్స్ పార్టీ నిర్వాహకుడి జోలికి వెళ్లకుండా.. ఇతరులను అరెస్టు చేశారు’’ అని విమర్శించారు. వాంఖడే భార్య క్రాంతి గురువారం మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌కు లేఖ రాశారు. ‘బాల్‌ఠాక్రే బతికే ఉంటే.. మహిళలకు అవమానాన్ని సహించేవారా?’’ అని ప్రశ్నించారు.