పాత, కొత్త మేలు కలయికలా అయోధ్యను తీర్చిదిద్దండి : మోదీ
ABN , First Publish Date - 2021-06-26T20:01:10+05:30 IST
అయోధ్య నగరం ప్రతి భారతీయుడికి ఎంతో సుపరిచితమైన నగరమని, సాంస్కృతిక నగరంగా ప్రతి భారతీయుడి మదిలో ఉందని ప్రధాని
న్యూఢిల్లీ : అయోధ్య నగరం ప్రతి భారతీయుడికి ఎంతో సుపరిచితమైన నగరమని, సాంస్కృతిక నగరంగా ప్రతి భారతీయుడి మదిలో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అభివృద్ధి పనుల్లో సాంస్కృతిక, సంప్రదాయాలు స్పష్టంగా గోచరిస్తూనే ఉండాలని, అందులో సంస్కృతి మిళితమైపోవాలని సూచించారు. అయితే అయోధ్య నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులు రాబోయే తరాలకు కూడా అనుసంధానించేలా ఉండాలని సూచించారు. అయోధ్య నగరం అభివృద్ధిపై ప్రధాని నరేంద్ర మోదీ శనివారం వర్చువల్ పద్ధతిలో సమీక్షా సమావేశం నిర్వహించారు. శ్రీరాముడు తన పరిపాలనలో ఏవిధంగానైతే ప్రజలను ఏకతాటిపై నడిపించారో, అలాగే అయోధ్య అభివృద్ధి విషయంలో సమాజం మొత్తాన్ని ఏకతాటిపైకి తెచ్చి, అభివృద్ధిలో పాలు పంచుకునేలా చేయాలని అన్నారు. ముఖ్యంగా ఈ అభివృద్ధి పనుల్లో స్థానిక యువత నైపుణ్యాలను పరిగణనలోకి తీసుకోవాలని మోదీ సూచించారు. ‘‘అయోధ్య అందరి నగరం. ఆధ్యాత్మిక నగరం. ఉత్కృష్టమైన నగరం. చేపట్టబోయే అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాలు భవిష్యత్ తరాలకు సరిపోయేలా ఉండాలి. యాత్రికులతో పాటు ప్రతి ఒక్కరికీ ఉపయోగకరంగా మారాలి. భవిష్యత్తులోనూ అభివృద్ధి పనులు కొనసాగుతూనే ఉంటాయి. అత్యంత కీలకమైన అభివృద్ధి దశ ఇప్పుడే ప్రారంభమైంది. అయోధ్య గుర్తింపును, సాంస్కృతిక చైతన్యాన్ని సజీవంగా ఉంచడానికి సమష్టిగా ప్రయత్నం చేద్దాం. పాత,కొత్త మేలు కలయికలా నగరం ఉండాలి’’ అని మోదీ అభిప్రాయపడ్డారు. జీవితంలో ఒక్కసారైనా అయోధ్యను దర్శించాలన్న తపన భవిష్యత్ తరాలకు కలిగేలా అభివృద్ధి జరగాలని మోదీ సూచించారు.