యుద్ధం ఆపే యత్నం

ABN , First Publish Date - 2021-05-18T07:44:36+05:30 IST

వారం రోజులుగా జరుగుతున్న హమాస్‌ రాకెట్‌, ఇజ్రాయిల్‌ వైమానిక దాడులను ఆపడానికి, శాంతి నెలకొల్పడానికి ఐక్యరాజ్యసమితి(యూఎన్‌) భద్రతా మండలి, ఇస్లామిక్‌ దేశాలు ముమ్మరంగా

యుద్ధం ఆపే యత్నం

ఇజ్రాయిల్‌ దాడులపై భద్రతామండలి, 

ఇస్లామిక్‌ దేశాల అత్యవసర సమావేశం


గాజా/వాషింగ్టన్‌/జెరూసలేం, మే 17: వారం రోజులుగా జరుగుతున్న హమాస్‌ రాకెట్‌, ఇజ్రాయిల్‌ వైమానిక దాడులను ఆపడానికి, శాంతి నెలకొల్పడానికి ఐక్యరాజ్యసమితి(యూఎన్‌) భద్రతా మండలి, ఇస్లామిక్‌ దేశాలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. భద్రతా మండలి దౌత్యవేత్తలు, ముస్లిం దేశాల విదేశాంగ మంత్రులు ఆదివారం అత్యవసరంగా సమావేశమయ్యారు. దాడులను, పౌర రక్తపాతాన్ని ఆపాలని ఇరువైపులవారిని డిమాండ్‌ చేశారు. హమాస్‌ మిలిటెంట్‌ గ్రూపులు లక్ష్యంగా గాజా నగరంపై సోమవారం తెల్లవారుజామున ఇజ్రాయిల్‌ యుద్ధవిమానాలు ఒక్కసారిగా దాడి చేశాయి. నగరాన్ని ధ్వంసం చేశాయి. 15 కిలోమీటర్ల మేర ఉగ్రవాద సొరంగాలను ధ్వసం చేశారు. ఇస్లామిక్‌ మిలిటెంట్‌ గ్రూపుకు చెందిన నాయకుడిని చంపారు. గాజాలోని ఏకైక విద్యుత్తు కేంద్రంలో ఇంధనం అయిపోయే ప్రమాదం ఉం దని, ఇంకా రెండు, మూడు రోజులు మాత్రమే విద్యుత్తు సరఫరా చేయగలమని విద్యుత్తు పంపిణీ సంస్థ తెలిపింది.  గా జాలోని హమాస్‌ కమాండర్లు తొమ్మిదిమంది ఇళ్లపై దాడు లు జరిపినట్లు ఇజ్రాయిల్‌ మిలిటరీ తెలిపింది. హమాస్‌ ఉగ్రవాదులు కూడా ఇజ్రాయిల్‌ పౌరప్రాంతాలవైపు రాకెట్లను ప్రయోగించి వారిపై ఒత్తిడి పెంచారు. కాల్పుల విరమణ విషయంలో ఇజ్రాయిల్‌పై ఒత్తిడి పెంచడానికి అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ప్రభుత్వంలోని కొంతమంది  డెమోక్రాట్లు పిలుపు ఇచ్చినప్పటికీ ఆయన మాత్రం అందుకు తగిన సంకేతాలు ఇవ్వలేదు. 


అయితే ఐక్యరాజ్యసమితిలోని ఆయన రా యబారి లిండా థామ్‌స-గ్రీన్‌ఫీల్డ్‌ భద్రతా సమితి ఉన్నతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ ఈ పోరాటాన్ని ఆపడానికి దౌత్యమార్గాల ద్వారా అమెరికా ప్రయత్నిస్తుందని చెప్పా రు.  ఇజ్రాయిల్‌ దాడులు ఆపాలని ముస్లిం దేశాల ప్రతినిధులు కోరారు. పాలస్తీనా పౌరులను హతమార్చడాన్ని 57 ఇస్లామిక్‌ దేశాల సహకార సంస్థ(ఓఐసీ) ఖండించింది.    మీడియాను లక్ష్యంగా చేసుకొని అసోసియేటెడ్‌ ప్రెస్‌(ఏపీ), ఆల్‌జజీరా, ఇతర మీడియా కార్యాలయాలు ఉన్న గాజా సిటీ భవనంపై ఇజ్రాయిల్‌ దాడి చేసిందని ఏపీ ఎడిటర్‌ ఆరోపించారు. దీనిపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఈ దాడిని మీడియా సంస్థలపై యుద్ధనేరంగా పరిగణించాలని అంతర్జాతీయ జర్నలిస్టులు ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌ కోర్టును కోరారు. కాగా, ఇజ్రాయిల్‌కు జర్మనీ సంఘీభావం తెలిపింది. హమాస్‌ రాకెట్‌ దాడులను ఖండించింది. 

Updated Date - 2021-05-18T07:44:36+05:30 IST