ఆసనమే.. ఆశాకిరణం!

ABN , First Publish Date - 2021-06-22T06:47:51+05:30 IST

కొవిడ్‌పై పోరులో యోగా ఓ ఆశాకిరణమని ప్రధాని మోదీ అన్నారు. 7వ అంతర్జాతీయ యోగా

ఆసనమే.. ఆశాకిరణం!

  •  కొవిడ్‌పై పోరులో యోగా సాయం: మోదీ
  •  డబ్ల్యూహెచ్‌వోతో కలిసి ‘ఎం -యోగా’ యాప్‌ 


న్యూఢిల్లీ, జూన్‌ 21: కొవిడ్‌పై పోరులో యోగా ఓ ఆశాకిరణమని ప్రధాని మోదీ అన్నారు. 7వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా సోమవారం కోట్లాది మంది యోగాసనాలు వేశారని చెప్పారు. నడుము వంచి పాదాలు తాకారని, ఆకాశానికేసి శరీరాన్ని సాగదీశార ని, శ్వాస మీద ధ్యాస పెట్టారని తెలిపారు. పర్వతాల నుంచి సాగర తీరాల దాకా, నగరాల నుంచి ఇళ్ల పక్కనే ఉండే పార్కుల వరకు, ఇళ్ల నుంచి ప్రపంచం నలుమూలల వరకు ప్రజలు యోగాసనాలు, ప్రాణాయామం చేశారని ప్రధాని చెప్పారు. కరోనా మహమ్మారిపై పోరులో యోగా కీలకపాత్ర పోషిస్తుందన్న మోదీ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)తో కలిసి ‘ఎం-యోగా’ యాప్‌ను రూపొందించినట్లు ప్రకటించారు.ఈ యాప్‌లో యోగా శిక్షణకు సంబంధించి వేర్వేరు భాషల్లో వీడియోలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. యోగాను ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు ఈ యాప్‌ దోహదపడుతుందని, ‘ఒకే ప్రపంచం, ఒకే ఆరోగ్యం’ దిశగా చే స్తున్న ప్రయత్నాలకు అండగా నిలుస్తుందని ప్రధాని చెప్పారు.


శ్వాసకోశ వ్యవస్థ బలోపేతానికి యోగాలో ఉన్న వ్యాయామాలు ఉపయోగపడతాయని నిపుణు లు చెబుతున్నారని గుర్తుచేశారు. స్కూళ్లు ఆన్‌లైన్‌ తరగతుల్లోనూ ప్రాణాయామం లాంటి యోగాభ్యాసాలు చేయిస్తున్నారని, ఇది కొవిడ్‌పై పోరులో పిల్లలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన గొప్ప బహుమతుల్లో యోగా ఒకటని రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ అన్నారు. ఆయన యోగాసనాలు వేసిన ఫొటోను రాష్ట్రపతి భవన్‌ ట్విటర్‌ లో ఉంచింది. ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో యోగా చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చా రు. సోమవారం ఆయన తన సతీమణి ఉషమ్మతో కలిసి యోగాసనాలు వేశారు. మానసిక ఒత్తిడి నుంచి బయటపడి దృఢంగా తయారవడానికి, ప్రతికూల ప్రభావాల నుంచి బయటపడి సరికొత్త ఆలోచనలను పెంచుకోవడానికి యోగా దారి చూపుతుందని హిమాచల్‌ప్రదేశ్‌  గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు. 


న్యూయార్క్‌లోని టైమ్స్‌ స్క్వేర్‌లో యోగా దినోత్సవం సందర్భంగా 3000 మందికి పైగా ఆసనాలు వేశారు. కోయంబత్తూరులో కొందరు కొవిడ్‌ రోగులు పీపీఈ కిట్లు ధరించి యోగాసనాలు వేశారు. లద్దాఖ్‌లో ఎముకలు కొరికే చలిలో సైతం ఐటీబీపీ జవాన్లు సూర్యనమస్కారాలు చేశారు. కాగా, యోగా నేపాల్‌లోనే పుట్టిందంటూ ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.


Updated Date - 2021-06-22T06:47:51+05:30 IST