ఆర్యన్ ఖాన్ విడుదల శనివారానికి వాయిదా
ABN , First Publish Date - 2021-10-30T00:17:43+05:30 IST
బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు

ముంబై : బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ మరో రాత్రి జైలులోనే గడపవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆయన తరపు లీగల్ టీమ్ సకాలంలో బెయిలు పత్రాలను జైలు అధికారులకు సమర్పించలేకపోవడంతో శుక్రవారం ఆయన విడుదల కాలేదు. ఆయన విడుదలయ్యేది శనివారమేనని ఆర్థర్ రోడ్ జైలు అధికారులు తెలిపారు.
ఆర్థర్ రోడ్ జైలు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఆర్యన్ ఖాన్ మరో రాత్రి జైలులోనే గడపాలి. ఆయన తరపు లీగల్ టీమ్ శుక్రవారం సాయంత్రం 5.30 గంటలలోగా బెయిల్ పేపర్ వర్క్‌ను పూర్తి చేయవలసి ఉండగా, వారు ఆ గడువులోగా ఆ పనిని పూర్తి చేయలేకపోయారు. బెయిలు పేపర్స్‌ను జైలు అధికారులకు శుక్రవారం సాయంత్రం గడువు ముగిసిన తర్వాత సమర్పించినందువల్ల ఆర్యన్ ఖాన్ శనివారం విడుదలవుతారు.
లీగల్ టీమ్‌ను నిలదీసిన కోర్టు అధికారి
ఆర్యన్ ఖాన్ తరపు లీగల్ టీమ్‌ను కోర్టు అధికారి ఒకరు నిలదీశారు. ‘‘మీరు ఎప్పుడూ ష్యూరిటీ వర్క్ చేయలేదా?’’ అని ప్రశ్నించారు. ఆర్యన్ ఖాన్‌కు జామీను ఇచ్చిన జుహీ చావ్లా ఫొటోలు రెండు కావలసి ఉండగా, అవి లీగల్ టీమ్ వద్ద లేవు. దీంతో ఆ అధికారి ఈ లీగల్ టీమ్‌ను గట్టిగా ప్రశ్నించారు. చివరికి ఆమె ఫొటోలను తీసుకొచ్చి, పేపర్ వర్క్‌ను పూర్తి చేశారు.
జుహీ చావ్లా హర్షం
సెషన్స్ కోర్టు వెలుపల జుహీ చావ్లా మాట్లాడుతూ, ఆర్యన్ ఖాన్ విడుదల కాబోతుండటంపై ఆనందం వ్యక్తం చేశారు. ఆయన త్వరలోనే ఇంటికి రాబోతుండటం తనకు సంతోషంగా ఉందన్నారు. అందరికీ ఇదొక గొప్ప ఉపశమనమని పేర్కొన్నారు.
ఆర్థర్ రోడ్ జైలు సూపరింటెండెంట్ నితిన్ మాట్లాడుతూ, ఆర్యన్ ఖాన్ విడుదలకు బెయిలు ఆర్డర్‌ను భౌతికంగా జైలు వెలుపల ఉండే బెయిల్ బాక్స్‌లో వేయవలసి ఉందని చెప్పారు. జైలు అధికారులు శుక్రవారం సాయంత్రం 5.35 గంటల వరకు వేచి చూశారని చెప్పారు.