రెండు కోట్ల మందిని కాపాడటమే నేరమా? కేజ్రీవాల్
ABN , First Publish Date - 2021-06-25T23:19:50+05:30 IST
కరోనా సమయంలో కేజ్రీవాల్ సర్కార్ ఆక్సిజన్ అవసరాన్ని నాలుగు రేట్లు అత్యధికంగా చేసి చూపించిందన్న సుప్రీం ప్యానల్
న్యూఢిల్లీ : కరోనా సమయంలో కేజ్రీవాల్ సర్కార్ ఆక్సిజన్ అవసరాన్ని నాలుగు రేట్లు అత్యధికంగా చేసి చూపించిందన్న సుప్రీం ప్యానల్ మధ్యంతర నివేదిక పేర్కొనడం దుమారం రేపుతోంది. ఇదే విషయాన్ని బీజేపీ ప్రస్తావిస్తూ, కేజ్రీవాల్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘ఢిల్లీకి చెందిన 2 కోట్ల మంది ప్రజల కోసం పోరాడటమే నేను చేసిన పెద్ద నేరం. ఆ సమయంలో ప్రధాని మోదీ ఎన్నికల ర్యాలీల్లో బిజీబిజీగా ఉండిపోయారు. ఆ సమయంలో నేను అహోరాత్రాలు శ్రమించి, ఢిల్లీ ప్రజలకు ఏర్పడ్డ ఆక్సిజన్ కొరతను నివారించగలిగాను. కరోనా కారణంగా ప్రజలు తమ తమ కుటుంబీకులను కోల్పోయి, తీవ్ర మనోవేదనలో మిగిలిపోయారు. లేనిపోని తప్పులు చెప్పకండి. వారికి అసహ్యం వేస్తుంది’’ అంటూ ముఖ్యమంత్రి ట్విట్టర్ వేదికగా స్పందించారు.
మరోవైపు సుప్రీం ప్యానల్ మధ్యంతర నివేదిక ఆప్, బీజేపీ మధ్య చిచ్చు పెట్టింది. సుప్రీం ప్యానల్‌ను నివేదిక అంతా తప్పేనని ఆప్ కొట్టిపారేస్తోంది. బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, అలాంటి నివేదిక ఏదీ లేదని డిప్యూటీ సీఎం సిసోడియా వ్యాఖ్యానించారు. మరోవైపు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా కూడా ఆప్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కేజ్రీవాల్ ఘోరమైన తప్పిదానికి పాల్పడ్డారని, దీని మూల్యం ఇంత పెద్ద మొత్తంలో చెల్లించుకోవాల్సి వస్తోందని ఘాటుగా విమర్శించారు. ఈ నేర పూరిత చర్యలకు కేజ్రీవాల్ వెంటనే క్షమాపణలు చెప్పాలని సంబిత్ పాత్రా డిమాండ్ చేశారు.