పాత్రలో లీనమై.. పొడవబోయింది!

ABN , First Publish Date - 2021-02-26T09:19:48+05:30 IST

కళాకారులు పాత్రలో నటించడం కంటే జీవిస్తేనే.. అది సినిమా అయినా, నాటకమైనా రక్తికడుతుంది. ఈ క్రమంలో వారు పాత్రలో లీనమైతేనే ఇబ్బంది!

పాత్రలో లీనమై.. పొడవబోయింది!

కర్ణాటకలో కళాకారిణి రౌద్రావతారం


బెంగళూరు, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): కళాకారులు పాత్రలో నటించడం కంటే జీవిస్తేనే.. అది సినిమా అయినా, నాటకమైనా రక్తికడుతుంది. ఈ క్రమంలో వారు పాత్రలో లీనమైతేనే ఇబ్బంది! తాజాగా ఓ కళాకారిణి ఇలా పాత్రలో పరకాయ ప్రవేశం చేసి హత్యాయత్నానికి పాల్పడడం తీవ్ర సంచలనం కలిగించింది. ద్రౌపది పాత్రలో నటించిన ఓ కళాకారిణి నిజంగానే రౌద్రావతారం ఎత్తిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌ అవుతోంది. కర్ణాటకలో మండ్య జిల్లాలోని నాల్వడి కృష్ణరాజ ఒడయార్‌ కళామందిరంలో ఈ నెల 4న ‘కౌండలీకన వధ’ అనే పౌరాణిక నాటక ప్రదర్శన జరిగింది. దీనిలో ద్రౌపది పాత్ర పోషించిన దొడ్డ శృతి నాటకం చివర్లో కాళికాదేవి అవతారమెత్తి త్రిశూలంతో రాక్షసుడు కౌండలికను సంహరించే సన్నివేశం ఉంది. చివర్లో కౌండలికను ద్రౌపది కింద పడేసి త్రిశూలాన్ని అయన గుండెకు ఆనిస్తే నాటకం పూర్తవుతుంది. కానీ.. కౌండలీకను గట్టిగా తోసి కిందపడేసిన ద్రౌపది పాత్రధారి ఆవేశంతో బిగ్గరగా కేకలు వేస్తూ త్రిశూలంతో ఆయన్ను పొడిచేందుకు ముందుకురికింది. అయితే పరిస్థితిని గమనిస్తున్న సహకళాకారులు.. ఉపద్రావాన్ని ముందే గుర్తించి వేదికపైకి వెళ్లి ఆమెను బలవంతంగా అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. శృతి మాట్లాడుతూ.. వేదికపై ఒక్కక్షణం ఏమైందో తనకు తెలియలేదని పేర్కొంది.

Updated Date - 2021-02-26T09:19:48+05:30 IST