Congress ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, కానీ ఆ చెత్త మాకొద్దు : Kejriwal
ABN , First Publish Date - 2021-11-23T20:00:15+05:30 IST
చాలా మంది కాంగ్రెస్ నేతలు ఆమ్ ఆద్మీ పార్టీని సంప్రదిస్తున్నారని

అమృత్సర్ : చాలా మంది కాంగ్రెస్ నేతలు ఆమ్ ఆద్మీ పార్టీని సంప్రదిస్తున్నారని, అయితే ఆ చెత్తను తీసుకోవాలని తాము కోరుకోవడం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. తమ పార్టీలోకి కాంగ్రెస్ నేతలను చేర్చుకోవడం ప్రారంభిస్తే, పంజాబ్లోని 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ రోజు (మంగళవారం) సాయంత్రానికి వచ్చి చేరుతారని అన్నారు. ఇద్దరు, ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు కూడా తమతో టచ్లో ఉన్నారన్నారు. వీరంతా తమ పార్టీలో చేరాలని కోరుకుంటున్నారని చెప్పారు.
కేజ్రీవాల్ మంగళవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, అనేక మంది కాంగ్రెస్ నేతలు తమతో టచ్లో ఉన్నారన్నారు. వారిని చేర్చుకోవడం ప్రారంభిస్తే, పంజాబ్లోని 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ రోజు (మంగళవారం) సాయంత్రానికి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతారని అన్నారు. కానీ ఆ చెత్తను తీసుకోవాలనుకోవడం లేదన్నారు. ఇద్దరు, ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు కూడా తమతో టచ్లో ఉన్నారన్నారు.
పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూను ఆ పార్టీ అణగదొక్కుతోందన్నారు. ఇసుక మాఫియా వంటి అనేక సమస్యలపై ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ చెప్తున్న అవాస్తవాలను నవజోత్ సింగ్ సిద్ధూ బయటపెడుతున్నారన్నారు. సిద్ధూను చన్నీ అణచివేయడానికి ఇదే కారణమని పేర్కొన్నారు. రానున్న పంజాబ్ శాసన సభ ఎన్నికలకు ముఖ్యమంత్రి అభ్యర్థిని మిగిలిన పార్టీల కన్నా ముందుగానే ప్రకటిస్తామని చెప్పారు.
ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసినట్లుగానే, పంజాబ్లోని ప్రభుత్వ పాఠశాలలను కూడా మెరుగుపరుస్తామని చెప్పారు. ఈ పని చేయడం ఎలా చేయాలో తమకు మాత్రమే తెలుసునని చెప్పారు. ఇతర పార్టీలకు అది తెలియదని తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలను అత్యవసర ప్రాతిపదికపై పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.