దేవభూమిలో జలవిలయం
ABN , First Publish Date - 2021-10-20T07:51:26+05:30 IST
దేవభూమి ఉత్తరాఖండ్‌లో జలవిలయం 42 మందిని దిగమింగింది. రాష్ట్రమంతా జలదిగ్బంధంలో చిక్కుకుంది.

- ఉత్తరాఖండ్‌లో వర్ష బీభత్సానికి 42 మంది దుర్మరణం
- విరిగి పడ్డ కొండ చరియలతో రోడ్లన్నీ బ్లాక్..
- నైనిటాల్‌కు ఇతర ప్రాంతాలతో సంబంధాలు కట్
- ఎక్కడికక్కడ స్తంభించిన బద్రీనాథ్ హైవే..
- కొండ ప్రాంతాల్లో కూలిన ఇళ్లు.. ధ్వంసమైన వంతెనలు
- రంగంలోకి సైన్యం.. హెలికాప్టర్లతో సహాయచర్యలు..
- మృతుల కుటుంబాలకు ప్రధాని సంతాపం
- రూ. 4 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వ పరిహారం..
- యూపీలోనూ భారీ వర్షాలు.. నలుగురి మృతి
- కేరళలోనూ కొనసాగుతున్న వరద..
- తగ్గిన వర్షాలు.. నేటి నుంచి మళ్లీ వర్షాలకు చాన్స్
డెహ్రాదూన్/తిరువనంతపురం, అక్టోబరు 19: దేవభూమి ఉత్తరాఖండ్‌లో జలవిలయం 42 మందిని దిగమింగింది. రాష్ట్రమంతా జలదిగ్బంధంలో చిక్కుకుంది. నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నదులు ఉప్పొంగుతున్నాయి. వరద బీభత్సానికి తోడు.. కొండచరియలు విరిగిపడడంతో కీలకమైన రహదారులన్నీ మూసుకుపోయాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లు కూలాయి. నదులపై ఒకట్రెండు చోట్ల వంతెనలు ధ్వంసమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు సహాయక చర్యలకోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. నైనిటాల్ జిల్లా అతలాకుతలమైంది. నైనిటాల్ నగరానికి దారితీసే మూడు హైవేలపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో.. నైనిటాల్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరదకు తోడు.. 24 గంటల్లో 50 సెంటీమీటర్ల వర్షపాతంతో నైనిటాల్ సరస్సు పొంగిపొర్లుతోంది. దీంతో.. సమీప గ్రామాలు జలమయమయ్యాయి. ప్రఖ్యాత నైనాదేవి ఆలయం, నిత్యం రద్దీగా ఉండే మాల్ రోడ్డు నీట మునిగాయి. మంగళవారం కొండచరియలు విరిగిపడి.. నీటి ఉధృతి కారణంగా 42 మంది చనిపోయారు. ఒక్క నైనిటాల్ జిల్లాలోనే 28 మరణాలు నమోదయ్యాయి. ఆల్మోరా, చంపావత్ జిల్లాల్లో ఆరేసి మంది, పిథోరాగఢ్, ఉధమ్‌సింగ్ నగర్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. నైనిటాల్ జిల్లాలోని ముక్తేశ్వర్, ఖైరానా గ్రామాలకు చెందిన ఏడుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. రామ్‌గఢ్ గ్రామంలోనూ కొండచరియలు విరిగిపడ్డాయి. పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి.
ఉత్తరాఖండ్ సర్కారు మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఆర్మీ కూడా రంగప్రవేశం చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. హల్దావని జిల్లాలో గౌలా నదిపైనున్న వంతెన, చంపావత్ ప్రాంతంలోని చల్దీనదిపై నిర్మాణంలో ఉన్న వంతెన నీటిలో కొట్టుకుపోయాయి. పలు నదుల వద్ద ఇదే పరిస్థితి కనిపించింది. దీంతో సమీపంలోని జిమ్ కార్బెట్ జాతీయ ఉద్యానవనంలోకి నీళ్లు చేరాయి. నానక్‌సాగర్ డ్యామ్ నుంచి నీటిని వదలడంతో.. ఈ పార్క్‌కు సమీపంలో ఉండే లెమన్‌ట్రీ హోటల్ జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. హోటల్ భవనం మూడంతస్తుల్లో ఉండగా.. రెండో అంతస్తు వరకు నీళ్లు చేరాయి. దీంతో అందులో ఉన్న సుమారు 100 మంది పర్యాటకులు పై అంతస్తుకు చేరుకుని ఆర్తనాదాలు చేశారు. విపత్తు నివారణ బృందాలు వారిని పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. వేర్వేరు ప్రాంతాల్లో మొత్తం 300 మందిని కాపాడినట్లు ఎన్డీఆర్ఎఫ్ ప్రకటించింది. అటు చార్ధామ్ యాత్రకు దారితీసే మార్గాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కేదార్నాథ్ యాత్ర నుంచి తిరిగివస్తూ.. జలదిగ్బంధంలో చిక్కుకుపోయిన 22 మంది భక్తులను విపత్తు నివారణ బృందాలు రక్షించాయి. అధికారులు చార్ధామ్ యాత్రను నిలిపివేశారు.
ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఏరియల్ సర్వే ద్వారా రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షించారు. అటు ఉత్తరప్రదేశ్‌లోనూ వర్షాల ఉధృతి కనిపించింది. ఓ ఇంటి గోడ కూలడంతో ఫతేపూర్‌కు చెందిన అత్తాకోడళ్లు మృతిచెందారు. బిశాల్పూర్లో ఇద్దరు వ్యక్తులు కరెంట్ షాక్‌తో చనిపోయారు. కాగా పశ్చిమ కనుమల్లో వాతావరణ అసమతుల్యత వల్లే కేరళలో వర్షాలు భారీగా కురుస్తున్నాయని వాతావరణ నిపుణుడు మాధవ్ గాడ్జిల్ అన్నారు. 2011లో అప్పటి కేంద్ర ప్రభుత్వం నియమించిన పశ్చిమ కనుమలపై జీవావరణ కమిటీ(డబ్ల్యూజీఈఈపీ) కి ఆయన నేతృత్వం వహించారు. అదే ఏడాది కేంద్రానికి ఆయన తన నివేదిక సమర్పించారు. తాజా వరదల నేపథ్యంలో ఆయన ఓ జాతీయ వార్తాసంస్థతో మాట్లాడారు. తన నివేదికపై అధ్యయనానికి యూపీఏ-2 సర్కారు అంతరిక్ష శాస్త్రవేత్త కస్తూరి రంగన్ కమిటీని ఏర్పాటు చేసిందని.. ఆ కమిటీ ప్రజల భాగస్వామ్యం అక్కర్లేదని చెప్పిందని, అది సరికాదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి, పశ్చిమకనుమల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు.
వరదల్లో చిక్కుకున్న హైదరాబాద్ యువతులు
లెమన్‌ట్రీ హోటల్లో చిక్కుకుపోయిన వారిలో హైదరాబాద్‌కు చెందిన యువతులు కూడా ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో వీరు చేసిన విజ్ఞప్తికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందించి, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్ మల్కాజిగిరిలోని ఆర్కేనగర్కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి సుష్మ తన ఐదుగురు స్నేహితులతో కలిసి దసరా సెలవుల సందర్భంగా నైనిటాల్‌కు వెళ్లారు. వారంతా సురక్షితంగా ఉన్నారంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ట్వీట్ చేశారు. వారిని ఢిల్లీకి తరలించే ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.
కేరళలో అదే వరద ఉధృతి
కేరళలోనూ వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువన డ్యామ్‌లను తెరుస్తుండడంతో.. దిగువ ప్రాంతాలకు వరద పోటెత్తుతోంది. ఇడుక్కి జిల్లాలోని చెరుథోని డ్యామ్ రెండు గేట్లను ఎత్తి, దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. పథనంతిట్ట జిల్లాలోని పంపా డ్యామ్‌పై రెండు గేట్లు తెరిచారు. 10 డ్యామ్‌లకు రెడ్ అలర్ట్ కొనసాగుతోందని, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని కేరళ రెవెన్యూ మంత్రి కె.రాజన్ వివరించారు. ఇప్పటిదాకా వరదలు, కొండ చరియలు విరిగిపడిన ఘటనల్లో 38 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు.
