20 మంది పిల్లల్ని కంటే..: ఉత్తరాఖండ్ సీఎం మరో వివాదం

ABN , First Publish Date - 2021-03-22T17:20:07+05:30 IST

ఉత్తరాఖండ్‌లో ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో తీరత్ సింగ్ మాట్లాడుతూ ‘‘ఒక్కొక్కరికి ప్రభుత్వం 5 కిలోల రేషన్ బియ్యం ఇస్తోంది. ఒకవేళ ఇంట్లో 10 మంది ఉంటే 50 కిలోల రేషన్ బియ్యం వస్తుంది.

20 మంది పిల్లల్ని కంటే..: ఉత్తరాఖండ్ సీఎం మరో వివాదం

డెహ్రడూన్: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రెండు వారాలు కూడా గడవకముందే వరుసగా మూడో వివాదంతో చరిత్ర సృష్టించారు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్. మహిళలు రిప్ప్‌డ్ జీన్స్ వేస్తున్నారని, భారతదేశాన్ని అమెరికా 200 ఏళ్లు పాలించిందంటూ వివాదాలతో తీవ్ర విమర్శలపాలైన ఆయన.. తాజాగా 20 మంది పిల్లల్ని కనాలంటూ చేసిన వ్యాఖ్యలు మరోసారి ఆయనను వివాదాల్లోకి నెట్టింది. హిందువులు ఎక్కువ మంది పిల్లల్ని కనాలంటూ భారతీయ జనతా పార్టీకి చెందిన పలువురు నేతలు గతంలో అనేక వ్యాఖ్యలు చేశారు. అయితే తీరత్.. మతపరమైన అంశాన్ని లేవనెత్తకుండా ప్రభుత్వ ఫలాలను ఎక్కువగా వినియోగించుకోవాలంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.


ఉత్తరాఖండ్‌లో ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో తీరత్ సింగ్ మాట్లాడుతూ ‘‘ఒక్కొక్కరికి ప్రభుత్వం 5 కిలోల రేషన్ బియ్యం ఇస్తోంది. ఒకవేళ ఇంట్లో 10 మంది ఉంటే 50 కిలోల రేషన్ బియ్యం వస్తుంది. అందే 20 మంది ఉంటే క్వింటాల్ బియ్యం వస్తుంది. 10 కిలలో బియ్యం తీసుకునే వారు క్వింటాల్ బియ్యం తీసుకునే వారిని చూసి అసూయ పడతారు. మరి క్వింటాల్ బియ్యం రావాలంటే 20 మంది ఉండాలి. ఇద్దరు పిల్లల్ని కనేవారు 20 మంది పిల్లల్ని కంటే అది సాధ్యం అవుతుంది’’ అని అన్నారు.


దీనికి కొద్ది సమయం ముందు ఆయన మాట్లాడుతూ ‘‘200 ఏళ్లుగా భారతీయుల్ని బానిసల్ని చేసి ఆధిపత్యం చెలాయించిన అమెరికా సైతం కోవిడ్‌ను ఎదుర్కోలేక చేతులెత్తేసింది’’ అని అన్నారు. అంతే కాకుండా ‘రవి అస్తమించని రాజ్యం’ అనే వ్యాఖ్యలను కూడా ఆయన ప్రసంగంలో జోడించారు. నిజానికి ఆయన బ్రిటన్‌ను దృష్టిలో పెట్టుకుని ఇలా మాట్లాడారనే విషయం స్పష్టమే అయినప్పటికీ ఒక సీఎం ఇలా బ్రిటన్‌కు అమెరికాకు తేడా తెలియకుండా మాట్లాడటం ఏంటని నెటిజెన్లు ట్రోల్ చేస్తున్నారు.

Updated Date - 2021-03-22T17:20:07+05:30 IST