సివిల్స్ అభ్యర్థులకు మరో చాన్స్
ABN , First Publish Date - 2021-02-06T07:49:40+05:30 IST
గత ఏడాది అక్టోబరులో జరిగిన యూపీఎస్సీ-2020 పరీక్షల్లో చివరి ప్రయత్నం పూర్తయిన అభ్యర్థులకు ఈ

యూపీఎస్సీ-2020కి హాజరైన వారికి మాత్రమే: కేంద్రం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: గత ఏడాది అక్టోబరులో జరిగిన యూపీఎస్సీ-2020 పరీక్షల్లో చివరి ప్రయత్నం పూర్తయిన అభ్యర్థులకు ఈ ఏడాది మరో చాన్స్ ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం సుప్రీంకోర్టులో ఓ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. కొవిడ్ మహమ్మారి వల్ల పరీక్షలను సరిగా రాయలేకపోయామని, చివరి ప్రయత్నం పూర్తవ్వడంతో తమకు అవకాశం లేకుండా పోయిందని, మరో చాన్స్ ఇవ్వాలంటూ రచనా సింగ్ అనే సివిల్స్ అభ్యర్థి వేసిన పిటిషన్‌ను జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ దినేశ్ మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం మరోమారు విచారించింది.
ఈ నెల 1న జరిగిన విచారణ సందర్భంగా ‘‘మరో ప్రయత్నానికి వెసులుబాటు కల్పించే అవకాశమే లేదు’’ అని కేంద్రం తేల్చిచెప్పింది. శుక్రవారం అనూహ్యంగా.. యూపీఎస్సీ-2020 పరీక్షల్లో చివరి ప్రయత్నం చేసిన వారికి.. యూపీఎస్సీ-2021కు మరో చాన్స్ ఇస్తామని ప్రకటించింది. చివరి ప్రయ త్నం పూర్తయినవారు కచ్చితంగా యూపీఎస్సీ- 2020 పరీక్షలకు హాజరై ఉండాలని, వయోపరిమితి విషయంలో ఎలాంటి వెసులుబాటు ఉండదని పేర్కొంది.