మహారాష్ట్ర హోం మంత్రికి పదవీ గండం!... అధికార పక్షాల నేతల భేటీ సోమవారం!...

ABN , First Publish Date - 2021-03-22T00:30:27+05:30 IST

మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు పదవీ గండం పొంచి ఉంది

మహారాష్ట్ర హోం మంత్రికి పదవీ గండం!... అధికార పక్షాల నేతల భేటీ సోమవారం!...

న్యూఢిల్లీ : మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు పదవీ గండం పొంచి ఉంది. ముంబై మాజీ సీపీ పరంబీర్ సింగ్ చేసిన ఆరోపణలు మారుమోగుతుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వ కూటమిలోని పార్టీలు సోమవారం అత్యవసరంగా న్యూఢిల్లీలో సమావేశం కాబోతున్నాయి. అనిల్‌ను పదవిలో ఉంచాలా? వద్దా? అనే అంశంపై నిర్ణయం తీసుకోవలసినది ముఖ్యమంత్రేనని ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ చెప్పడంతో ఇక అనిల్ మాజీ మంత్రి కాబోతున్నారని విశ్వసనీయ సమాచారం. 


ముంబై నగర మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు శనివారం ఓ లేఖ రాశారు. మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. అనిల్ తన అధికారిక నివాసానికి పోలీసు అధికారులను గత కొన్ని నెలల్లో అనేకసార్లు పిలిపించుకున్నారని పేర్కొన్నారు. ముంబైలోని బార్లు, రెస్టారెంట్లు, ఇతర సంస్థల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేసి, తనకు ఇవ్వాలని ఆదేశించారని చెప్పారు. ఈ సొమ్మును వసూలు చేసి, తనకు ఇవ్వాలని సస్పెండయిన ఏపీఐ సచిన్ వాజేను అనిల్ ఆదేశించారని తెలిపారు. 


అయితే  హోం మంత్రి, ఎన్‌సీపీ నేత అనిల్ దేశ్‌ముఖ్ స్పందిస్తూ, తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన పరంబీర్ సింగ్‌పై పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ ఆదివారం మాట్లాడుతూ, పరంబీర్ సింగ్ చేసిన ఆరోపణలు తీవ్రమైనవేనని, అయితే ఆయన ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు రాసిన లేఖలో సరైన ఆధారాలేవీ లేవని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, అనిల్ దేశ్‌ముఖ్ రాష్ట్ర హోం మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 


శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్ కలిసి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ పార్టీల అగ్ర నేతలు సోమవారం న్యూఢిల్లీలో అత్యవసరంగా సమావేశం కాబోతున్నట్లు ఈ కూటమిలోని ఓ పార్టీ సీనియర్ నేత ఒకరు ఆదివారం జాతీయ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అనిల్ దేశ్‌ముఖ్‌పై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే భావిస్తున్నట్లు తెలిపారు. అనిల్‌ను పదవి నుంచి తొలగించాలని భావిస్తున్నారని తెలిపారు. సోమవారం జరిగే కూటమి పక్షాల నేతల సమావేశంలో అనిల్ భవితవ్యం తేలనుందని చెప్పారు. 


ఇదిలావుండగా, నైతిక బాధ్యత వహించి హోం మంత్రి పదవికి రాజీనామా చేయాలని అనిల్ దేశ్‌ముఖ్‌ను కోరనున్నట్లు ఈ కూటమిలోని శివసేన సీనియర్ నేత ఒకరు చెప్పారు. 


Updated Date - 2021-03-22T00:30:27+05:30 IST