Matka Manపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల జల్లు

ABN , First Publish Date - 2021-10-25T22:23:09+05:30 IST

నగరంలో పేదలకు పరిశుభ్రమైన, తాజా తాగునీటిని

Matka Manపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల జల్లు

న్యూఢిల్లీ : నగరంలో పేదలకు పరిశుభ్రమైన, తాజా తాగునీటిని అందజేస్తున్న మట్కా మేన్‌ను ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ప్రశంసల్లో ముంచెత్తారు. పేదల తాగునీటి అవసరాలను తీర్చుతున్న మట్కా మేన్ సేవలకు సంబంధించిన వీడియోను ఆయన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీంతో మహీంద్రా, మట్కామేన్‌లను నెటిజన్లు అభినందిస్తున్నారు. 


అలగ్ నటరాజన్ వురపు మట్కా మేన్ ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలకు సురక్షితమైన తాగునీటిని అందిస్తున్నారు. ఈ సేవ చేయడం కోసం ఆయన తన పింఛను, పొదుపు చేసుకున్న సొమ్ము, కొందరు శ్రేయోభిలాషులు ఇచ్చిన విరాళాలతో ఓ మహీంద్ర బొలేరో మ్యాక్సి ట్రక్‌ను 2021 సెప్టెంబరులో కొన్నారు. దీనికి 1,000 లీటర్ల వాటర్ ట్యాంకులు రెండిటిని అమర్చారు. క్రమం తప్పకుండా సురక్షితమైన నీటిని ఈ వాహనం ద్వారా తీసుకెళ్ళి, పేదలకు పంపిణీ చేస్తున్నారు. 


మహీంద్రా గూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఇచ్చిన ట్వీట్‌లో, అద్భుత వ్యక్తులందరిలోనూ అత్యంత శక్తిమంతుడైన సూపర్ హీరో మట్కా మేన్ అని పేర్కొన్నారు. ఆయన ఇంగ్లండ్‌లో వ్యాపారం చేశారని, కేన్సర్ వ్యాధిని జయించారని, భారత దేశానికి వచ్చి, నిరాడంబరంగా పేదలకు సేవలందిస్తున్నారని తెలిపారు. ఈ అత్యుత్తమ కృషిలో బొలేరో వాహనానికి భాగస్వామ్యం కల్పించి, గౌరవించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ట్వీట్‌తో పాటు మట్కా మేన్ నీటి పంపిణీకి సంబంధించిన వీడియోను జత చేశారు. 


ఈ వీడియోను దాదాపు 63 వేల మంది చూశారు. ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. నెటిజన్లు మట్కా మేన్‌ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఆయన దయార్థ్ర హృదయంతో ఓ మంచి పని చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ భౌతికవాద ప్రపంచంలో ఇటువంటి పోస్ట్‌ల ద్వారా మన సంస్కృతిని మన తరం నేర్చుకోవాలని పేర్కొంటున్నారు. ఇటువంటి నిజమైన హీరోల గురించి వెలుగులోకి తెస్తున్నందుకు ఆనంద్ మహీంద్రాకు ధన్యవాదాలు చెప్తున్నారు. 


Updated Date - 2021-10-25T22:23:09+05:30 IST