గ్యాస్‌ సిలిండర్‌పై రూ.15 పెంపు

ABN , First Publish Date - 2021-10-07T08:15:23+05:30 IST

పెట్రో ధరల పోటుకు గ్యాస్‌ మంటలు తోడ వుతున్నాయి. మూలిగేనక్కపై తాటిపండు పడ్డ చందంగా.. ఇప్పుడు పండగ పూట వంట గ్యాస్‌ ధరలో పెంపు సాధారణ కుటుంబాలపై ..

గ్యాస్‌ సిలిండర్‌పై రూ.15 పెంపు

హైదరాబాద్‌లో ధర రూ.952

పెట్రో ధరలు మరింత భగ్గు

పెట్రోల్‌పై 30, డీజిల్‌పై 35 పైసల పెంపు

హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌ 

రూ.107.09, డీజిల్‌ రూ.99.75


న్యూఢిల్లీ, అక్టోబరు 6: పెట్రో ధరల పోటుకు గ్యాస్‌ మంటలు తోడ వుతున్నాయి. మూలిగేనక్కపై తాటిపండు పడ్డ చందంగా.. ఇప్పుడు పండగ పూట వంట గ్యాస్‌ ధరలో పెంపు సాధారణ కుటుంబాలపై మరింత భారం మోపుతోంది. బుధవారం ఎల్పీజీ సిలిండర్‌ ధర రూ.15 పెరిగింది. సబ్సిడీ, సబ్సిడీయేతర ఎల్పీజీ సిలిండర్ల ధర పెంచారు. దీంతో.. హైదరాబాద్‌లో సిలిండర్‌ ధర రూ.952కు చేరింది. గత జూలై నుంచి 14.2 కిలోల సిలిండర్‌ ధర రూ. 90 పెరిగింది. ఢిల్లీ, ముంబైలో సిలిండర్‌ ధర రూ.899.50 ఉండగా.. కోల్‌కతాలో రూ.926 ఉన్నట్టు చమురు కంపెనీలు పేర్కొన్నాయి. జూలై నుంచి ఎల్పీజీ ధరలు నాలుగుసార్లు పెరిగాయి. మరోవైపు ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేని విధంగా లీటరు పెట్రోల్‌ ధర బుధవారం ఒక్కరోజే ఏకంగా 30 పైసలు, డీజిల్‌ ధర 35 పైసలు పెంచాయి చమురు విక్రయ కంపెనీలు. దీంతో పెట్రో ధరలు మరింత భగ్గుమంటున్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌ ధర రూ.107.09 ఉండగా.. డీజిల్‌ ధర రూ.99.75 చేరింది. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.102.94కు, ముంబైలో రూ.108.96కు చేరుకోగా.. ఢిల్లీలో లీటరు డీజిల్‌ ధర రికార్డు గరిష్ఠ స్థాయిలో రూ.91.42కు, ముంబైలో రూ.99.17కు దూసుకుపోయింది. ఇప్పటికే మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, తెలుగు రాష్ట్రాల్లో కొన్ని పట్టణాల్లో డీజిల్‌ ధర సెంచరీ దాటేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల కారణంగా దేశీయంగానూ ఇంధనాల ధరలు పెరుగుతున్నాయి.  పెట్రో భారం సామాన్యుల నడ్డి విరుస్తోందని, ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించి వినియోగదారులకు ఊరట కల్పించాలని ప్రతిపక్షాలు  కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి.

Updated Date - 2021-10-07T08:15:23+05:30 IST