కల్యాణ్ సింగ్ మృతికి సంతాపం తెలిపిన వీసీపై ఆగ్రహం

ABN , First Publish Date - 2021-08-25T19:35:56+05:30 IST

ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ మృతికి

కల్యాణ్ సింగ్ మృతికి సంతాపం తెలిపిన వీసీపై ఆగ్రహం

లక్నో : ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ మృతికి సంతాపం తెలిపిన అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) వైస్ చాన్సలర్ తారిక్ మన్సూర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. మన్సూర్ చర్య క్షమించరాని నేరమని ఆరోపిస్తూ యూనివర్సిటీ క్యాంపస్‌లో పోస్టర్లు వెలిశాయి. దీనిపై విశ్వవిద్యాలయం అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. 


ఓ పోస్టర్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ మృతిపై అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం ఉప కులపతి సంతాపం తెలియజేయడం సిగ్గు చేటు మాత్రమే కాకుండా, తమ మతపరమైన మనోభావాలను కూడా ఆయన గాయపరిచారని ఆరోపించారు. ఇలా చేయడం ఏఎంయూ సంస్కృతి, సంప్రదాయాలకు  విరుద్ధమని పేర్కొన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేతలో కల్యాణ్ సింగ్ ప్రధాన ముద్దాయి మాత్రమే కాదని, సుప్రీంకోర్టు ఆదేశాలకు సంబంధించినంత వరకు ఆయన ఉపేక్షిత అపరాధి అని ఆరోపించారు. వీసీ చేసిన పని వల్ల యావత్తు అలీగఢ్ జాతికి గౌరవ భంగం కలిగిందని, ఇది సిగ్గు చేటు చర్య అని పేర్కొన్నారు. 


విశ్వవిద్యాలయం అధికారులు ఈ పోస్టర్లను తొలగించి, దర్యాప్తునకు ఆదేశించారు. ఇదిలావుండగా, కోవిడ్-19 నిబంధనల వల్ల ప్రస్తుతం క్యాంపస్ మూసివేసి ఉంది. ఎవరో దుండగులు ఈ పోస్టర్లను అతికించి ఉంటారని భావిస్తున్నారు. 


Updated Date - 2021-08-25T19:35:56+05:30 IST