సిద్ధూ వివాదాస్పద ఇంటర్వ్యూను పరిశీలించనున్న ఏఐసీసీ ప్యానల్

ABN , First Publish Date - 2021-06-22T14:37:00+05:30 IST

పంజాబ్‌ కాంగ్రెస్ యూనిట్‌లో తలెత్తిన వర్గ విభేదాలపై కాంగ్రెస్ అధిష్ఠానం ప్రత్యేకంగా దృష్టి..

సిద్ధూ వివాదాస్పద ఇంటర్వ్యూను పరిశీలించనున్న ఏఐసీసీ ప్యానల్

ఛండీగఢ్: పంజాబ్‌ కాంగ్రెస్ యూనిట్‌లో తలెత్తిన వర్గ విభేదాలపై కాంగ్రెస్ అధిష్ఠానం ప్రత్యేకంగా దృష్టి సారించింది. తాజాగా ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌పై విమర్శల దాడి చేస్తూ ఎమ్మెల్యే నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఓ వార్తాపత్రికకు చ్చిన ఇంటర్వ్యూను అధిష్ఠానం ఏర్పాటు చేసిన ఏఐసీసీ త్రిసభ్య ప్యానల్ సమీక్షించనుంది. సిద్ధూ వ్యాఖ్యలను పరిశీలించేందుకు మంగళవారం మధ్యాహ్నం 11 గంటలకు ఈ ప్యానల్ సమావేశమవుతోంది. ప్యానల్‌లో సభ్యులుగా మల్లికార్జున్ ఖర్గే, జేపీ అగర్వాల్, హరీష్ రావత్ ఉన్నారు.


''రెండు కుటుంబాల కంట్రోల్‌లో పంజాబ్ ఉంది'' అంటూ ఓ ఇంటర్వ్యూలో సిద్ధూ వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ నేత హరీష్ రావత్ మాట్లాడుతూ, సంబంధిత సమాచారాన్ని, ఆయన ఇచ్చిన ప్రకటనను పరిశీలిస్తామని అన్నారు. ఈ అంశం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాంగాంధీ ముందు ఉన్నందున వార్తాపత్రికల ముందు మాట్లాడటం సరికాదని ఆయన పేర్కొన్నారు. పార్టీ నాయకత్వం  మధ్యాహ్నం 11 గంటలకు సమావేశమవుతుందని ధ్రువీకరించారు. పంజాబ్ కాంగ్రెస్‌ యూనిట్‌లో తలెత్తిన లుకలుకలపై ప్యానల్ ఇచ్చిన రిపోర్టుపై మాట్లాడుతూ, కొన్ని అంశాలపై చర్చించేందుకు సోనియాగాంధీ ఆసక్తిగా ఉన్నారని, ఆ అంశాలపై కెప్టన్ అమరీందర్‌తో కమిటీ చర్చిస్తుందని తెలిపారు. 2019లో సిద్ధూ మంత్రిత్వ శాఖను కెప్టెన్ మార్చడంలో మంత్రివర్గం నుంచి సిద్ధూ తప్పుకున్నారు. అప్పట్నించి మంత్రివర్గంలో చేరేందుకు ఆయన ఆసక్తి కనబరచడం లేదు. పీసీసీ పోస్టుపై ఆయన కన్ను వేశారని చెబుతున్నారు.

Updated Date - 2021-06-22T14:37:00+05:30 IST